: టెస్టు క్రికెట్ కు గుడ్ బై చెప్పిన కలిస్


దక్షిణాఫ్రికా ఆల్ టైం గ్రేట్ క్రికెటర్లలో ఒకడైన జాక్వెస్ కలిస్ టెస్ట్ మ్యాచ్ లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇండియాతో డర్బన్ లో జరిగే రెండో టెస్టే (బాక్సింగ్ డే టెస్ట్) తన చివరి టెస్ట్ మ్యాచ్ అని తెలిపాడు. అయితే వన్డేలలో మాత్రం కొనసాగుతానని చెప్పాడు. ప్రపంచ అత్యుత్తమ ఆల్ రౌండర్లలో ఒకడిగా ఖ్యాతి గడించిన కలిస్... తన జట్టుకు ఎన్నోసార్లు ఒంటి చేత్తో విజయాలను సాధించి పెట్టాడు.

రిటైర్మెట్ సందర్భంగా కలిస్ మాట్లాడుతూ, తాను తీసుకున్న నిర్ణయం బాధాకరమైనప్పటికీ... ఇదే సరైన సమయంగా భావించానని తెలిపాడు. ఫిట్ నెస్ సహకరిస్తే రానున్న వన్డే వరల్డ్ కప్ లో ఆడతానని చెప్పాడు. కలిస్ 1995 డిసెంబరులో ఇంగ్లండ్ పై టెస్టుల్లో ఆరంగేట్రం చేశాడు. ఇప్పటిదాకా 165 టెస్టులాడి 13,174 పరుగులు చేశాడు. ఈ క్రమంలో 44 సెంచరీలు, 58 హాఫ్ సెంచరీలు నమోదు చేశాడు. టెస్టుల్లో కలిస్ అత్యధిక స్కోరు 228 పరుగులు.

టెస్ట్ క్రికెట్లో సచిన్, రిక్కీ పాంటింగ్, రాహుల్ ద్రవిడ్ ల తర్వాత అత్యధిక పరుగుల వీరుడుగా కలిస్ చరిత్రకెక్కాడు. దీనికి తోడు తన కచ్చితత్వంతో కూడిన బంతులతో టెస్టుల్లో ఏకంగా 292 వికెట్లను నేలకూల్చాడు. మరో గొప్ప విషయం ఏంటంటే... ప్రపంచ క్రికెట్ చరిత్రలో టెస్టులు, వన్డేలు రెండింటిలో 11 వేల పరుగులు, 250 వికెట్లను సాధించిన ఏకైక క్రికెటర్ కలిస్.

  • Loading...

More Telugu News