: ఎలాంటి సమస్యలు లేకుండా మూడు రాష్ట్రాలను వాజ్ పేయి ఏర్పాటు చేశారు: వెంకయ్యనాయుడు
దేశానికి దశ, దిశ నిర్దేశించిన గొప్ప రాజనీతిజ్ఞుడు వాజ్ పేయి అని బీజేపీ నేత వెంకయ్యనాయుడు కొనియాడారు. 23 రాజకీయ పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా.. వాజ్ పేయి దేశానికి సుస్థిర పాలన అందించారని ఆయన గుర్తు చేశారు. హైదరాబాదులో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి జన్మదినాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బీజేపీ నేత వెంకయ్య నాయుడు ప్రసంగించారు. ప్రపంచ దేశాల్లో భారత్ కు గుర్తింపు తీసుకువచ్చిన నేత వాజ్ పేయి అని.. కార్గిల్ యుద్ధంతో పాకిస్థాన్ కు తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. దేశంలో ధరలను, ద్రవ్యోల్బణాన్ని ఆయన అదుపు చేశారని చెప్పారు. రక్తపు బొట్టు చిందకుండా, లాఠీ విరగకుండా వాజ్ పేయి మూడు చిన్న రాష్ట్రాలను ఏర్పాటు చేశారని ఆయన ప్రస్తుతించారు.