: జనవరి ఒకటో తేదీన తిరుమలేశుని దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు: టీటీడీ
సంవత్సరం చివరి రోజు, నూతన సంవత్సరం ఆగమనాన్ని పురస్కరించుకొని భారీగా వస్తోన్న భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు టీటీడీ వెల్లడించింది. ప్రతి ఏటా సంవత్సరాదిన తిరుమలేశుని దర్శనానికి భారీసంఖ్యలో భక్తులు వస్తారన్న విషయం విదితమే. జనవరి ఒకటో తేదీన తెల్లవారు జామున 2 గంటల నుంచే వీఐపీ దర్శనం ప్రారంభమవుతుందని, ఒక్కొక్క వీఐపీకి ఆరు టిక్కెట్లు మాత్రమే కేటాయిస్తామని టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు తెలిపారు. జనవరి ఒకటో తేదీన ఉదయం ఐదు గంటల నుంచే భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తామని ఆయన అన్నారు. ఆ రోజు సుమారు 60 వేల మంది భక్తుల దర్శనానికి అనుగుణంగా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని, భక్తుల రద్దీ దృష్ట్యా సరిపడా లడ్డూలను నిల్వ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. సంవత్సరాదిన వయో వృద్ధులు, వికలాంగుల ప్రత్యేక దర్శనాన్ని రద్దు చేస్తున్నట్లు జేఈవో ప్రకటించారు.