: దేవయానికి బాసటగా ఆత్మకూరు కోకకోలా ప్లాంట్ లో కార్మికుల సమ్మె
అమెరికాలో భారత దౌత్యవేత్త దేవయాని ఖోబ్రాగాదె పట్ల అనుసరించిన తీరును నిరసిస్తూ గుంటూరు జిల్లా ఆత్మకూరులోని కోకకోలా ప్లాంటులో కార్మికులు నిన్న మెరుపు సమ్మెకు దిగారు. దేవయానిపై కేసును ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే యూనిట్ ను మూసివేయాలని హెచ్చరిక జారీ చేశారు. శాశ్వత, తాత్కాలిక కార్మికులు సుమారు 1,200 మంది ఇందులో పాల్గొన్నారు.
దీంతో తొలిరోజు ఉత్పాదకత నష్టపోయినట్లు ప్లాంట్ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణమే జోక్యం చేసుకుని కార్మికులతో సమ్మె విరమింప జేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. లేకుంటే డ్రింక్స్ కోసం సిద్ధంగా ఉంచిన కాన్సంట్రేట్ పాడైపోతుందని, పెద్ద ఎత్తున నష్టపోవాల్సి వస్తుందని తెలిపారు. దీంతో కార్మిక శాఖ అధికారులు రంగంలోకి దిగి కార్మికులతో చర్చలు జరిపారు. అయినా కార్మికులు దిగిరాలేదు. దేవయానిపై మోపిన కేసులన్నింటినీ తక్షణమే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.