: గోల్కొండ కోటలో ప్రేమికులపై పోలీసులది యాక్షనా.. ఓవర్ యాక్షనా?


చారిత్రక కట్టడం గోల్కొండ కోటలో ప్రేమికుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కోటను చూడ్డానికి వచ్చిన ప్రేమ జంటలను గుంజిళ్లు తీయించి మరీ పోలీసులు సాగనంపడాన్ని చూసిన వారు, హక్కుల సంఘాలు తప్పుబడుతున్నాయి. ప్రేమ జంటలది తప్పున్నా.. పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి ఎలా తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు.

అయితే, పోలీసులు చెబుతున్న విషయాలను కూడా ఇక్కడ గమనించాల్సి ఉంది. గోల్కొండ కోట చాలా విస్తీర్ణంలో ఉంటుంది. ప్రేమ జంటలు ఇక్కడకు రావడం, అసభ్యకర పనులు చేయడం ఒక దినచర్యగా మారిందని పోలీసులు చెబుతున్నారు. వారి అసభ్యకర చేష్టలు కోటను సందర్శించడానికి వచ్చే ఇతర సందర్శకులకు ఇబ్బందిని కలిగిస్తున్నాయని పేర్కొంటున్నారు. కోటలో చాటు మాటు ప్రదేశాల వద్ద వారు సాగించే పనులనూ ప్రస్తావిస్తున్నారు.

కోటను చూడ్డానికి ఎవరైనా రావచ్చని.. కానీ పాడు పనులకు వేదికగా చేసుకుని, సందర్శకులకు ఇబ్బంది కలిగిస్తే చూస్తూ ఊరుకోమంటున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రేమ జంటలు మళ్లీ ఇలాంటి పనులకు పాల్పడకుండా వారితో గుంజిళ్లు తీయించామని చెబుతున్నారు. అయితే, ఇలా చేసి ఉంటే పోలీసులు న్యూసెన్స్ కేసు పెట్టి కోర్టులో హాజరుపరచాలేగానీ, చట్టాన్ని చేతుల్లోకి ఎలా తీసుకుంటారని కొందరు ప్రశ్నిస్తున్నారు. దీంతో ఈ ఘటనపై విచారణకు డీసీపీ సత్యనారాయణ ఆదేశించారు.

  • Loading...

More Telugu News