: నెట్ వాడేవారిలోనే ఈ లక్షణాలు ఎక్కువట
ఇంటర్నెట్ను ఎక్కువగా వాడేవారిలోనే వ్యసనానికి బానిసలయ్యే లక్షణాలు ఎక్కువగా ఉంటాయని పరిశోధకులు చెబుతున్నారు. కొందరు అదేపనిగా ఇంటర్నెట్ ముందు కూర్చుంటారు. ఇలా గంటల తరబడి నెట్‌ను వాడడం వల్ల దానికే బానిసలుగా మారతారు. ఈ విషయంపై పరిశోధనలు చేసిన పరిశోధకులు అలాంటి వారిలో వ్యసనానికి బానిసలయ్యే లక్షణాలు ఉంటాయని తేల్చారు.
మిస్సోరీ, డ్యూక్ వర్సిటీలకు చెందిన పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో ఇంటర్నెట్ను అదేపనిగా వాడే యువతలో వ్యసన లక్షణాలు ఉంటాయని తేలింది. ఈ పరిశోధకుల బృందంలో భారత సంతతికి చెందిన శాస్త్రవేత్త కూడా ఉన్నారు. వీరు నిర్వహించిన పరిశోధనా ఫలితాలను ఈనెల 18న చెన్నైలో జరిగిన ఐఈఈఈ అంతర్జాతీయ సదస్సులో వెల్లడించారు. ఈ పరిశోధనలో 69 మంది కళాశాల విద్యార్ధుల ఇంటర్నెట్ వినియోగానికి సంబంధించిన అలవాట్లను ప్రత్యేక పద్ధతుల్లో విశ్లేషించారు.
వారు ఇళ్లలోను, కళాశాలలోను ఇంటర్నెట్ను ఎంత సమయం వినియోగిస్తున్నారు? వంటి అంశాలకు సంబంధించి ప్రత్యేక ప్రశ్నావళిని రూపొందించి, వారిని ప్రశ్నించారు. తమ పరిశోధన గురించి ముఖ్య అధ్యయనకర్త శ్రీరాం చెల్లప్పన్ మాట్లాడుతూ ఇంటర్నెట్ వాడకం, వ్యసన వైఖరి మధ్య సంబంధంపై తమ అధ్యయనంలో చాలా కొత్త విషయాలను తెలుసుకోవడానికి దోహదపడిందని చెబుతున్నారు.