: టొరంటో నగరంలో మంచు తుపాను.. 11 మంది మృతి
కెనడా దేశంలోని టొరంటో నగరాన్ని మంచు తుపాను ముంచెత్తింది. దీని ప్రభావంతో నగరంలోని చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తుపాను ధాటికి ఇప్పటికే 11 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. నిరంతరం కురుస్తోన్న మంచువానతో నగర పరిధిలో చాలా చెట్లు కూలిపోయినట్లు వార్తలు అందుతున్నాయి. విద్యుత్ సరఫరా లేకపోవడంతో కొన్ని విమానాలు రద్దయ్యాయి, మరికొన్ని ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో.. టొరంటో, మాంట్రియల్, ఒట్టావా విమానాశ్రయాల్లో వేలాది మంది ప్రయాణీకులు పడిగాపులు పడుతున్నారు. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు 72 గంటలు పడుతుందని టొరంటో నగర విద్యుత్ శాఖాధికారులు పేర్కొన్నారు. టొరంటో చరిత్రలోనే ఇది పెద్ద మంచు తుపాను అని ఆ నగర మేయర్ రాబ్ ఫోర్డ్ ప్రకటించారు. అత్యవసర పరిస్థితి ప్రకటించే ఆలోచనలో ఉన్నట్లు మేయర్ తెలిపారు.