: వేళకు తినకుంటే ఇలాంటి సమస్యలొస్తాయి
మనలో చాలా మంది వేళకు భోజనం చేయరు. ముఖ్యంగా ఉద్యోగం చేసేవారిలో మగువలైతే టైం అయిపోయిందని, ఇక తినడం మొదలుపెడితే కార్యాలయానికి సమయానికి చేరుకోలేమని... ఇలా ఆందోళనతో ఉదయం పూట సరిగ్గా టిఫిన్ చేయరు. అలాగే ఇంట్లో ఉండే మగువలు కూడా పనిభారం ఎక్కువగా ఉండడం వల్ల సమయానికి భోజనం చేయరు. దీని ప్రభావం వారి రోజువారీ ప్రవర్తనపై పడుతుందట. చాలామంది ఉదయాన్నే చాలా చిరాగ్గా ఉంటారు. దీనికి కారణం వేళకు సరిగ్గా భోజనం చేయకపోవడమేనని నిపుణులు చెబుతున్నారు. పరిశోధకులు వేలమంది ఉద్యోగినులు, గృహిణులపై నిర్వహించిన సర్వేలో ఈ విషయం తేలింది.
మెల్బోర్న్కు చెందిన మానసిక నిపుణుల బృందం ఉదయం పూట మహిళలు చిరాగ్గా ఉండడానికి కారణం ఏమిటా? అని దీనిపై ప్రత్యేక అధ్యయనాన్ని నిర్వహించింది. ఈ అధ్యయనంలో వేలమంది ఉద్యోగినులు, గృహిణులను పరిగణనలోకి తీసుకుని వారి దినచర్యను, జీవనశైలిని, ఆరోగ్య పరిస్థితులను గురించి విచారించారు. ఈ అధ్యయనంలో తేలిన విషయంమేమంటే ఆడవారు బోలెడన్ని బాధ్యతలతో శారీరకంగాను, మానసికంగాను ఎంతో శ్రమ పడతారని, చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటారని, దీని ఫలితంగా పొద్దునే చాలా నీరసంగా ఉంటారని గుర్తించారు.
కాబట్టే ఉదయాన్నే కొందరు మహిళలు చిరాకును, కోపాన్ని ప్రదర్శిస్తారట. అయితే ఇది కాసేపు మాత్రమే. మళ్లీ మామూలుగా తమ పనులను చేసుకుపోతుంటారట. ఇలా పొద్దునే కోపానికి కారణం పనుల ఒత్తిడితో సరిగా భోజనం చేయకపోవడం, ఉద్యోగంలో ఒత్తిడి కారణంగా హటాత్తుగా నిద్రలేవడం ఇలాంటివన్నీ కూడా కారణమవుతాయని కాబట్టి ఇలాంటి సమస్యలను అధిగమించాలంటే ఎప్పటికప్పుడు పక్కా ప్రణాళికతో వ్యవహరిస్తే మంచిదని నిపుణులు చెబుతున్నారు.