: కాంగ్రెస్ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తోంది: నరేంద్ర మోడీ
బ్రిటీష్ వారి విభజించు పాలించు సిద్ధాంతాన్ని కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తోందని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఎద్దేవా చేశారు. సర్ధార్ పటేల్ దేశాన్ని ఏకతాటిమీదకు తెస్తే... కాంగ్రెస్ విచ్ఛిన్నం చేస్తోందని మండిపడ్డారు. దేశ సమస్యలన్నింటికీ కాంగ్రెస్ పార్టీనే కారణమని అన్నారు. దేశం నుంచి కాంగ్రెస్ ను సాగనంపాల్సిన సమయం ఆసన్నమయిందని... అప్పుడే దేశం అభివృద్ధి పథంలో సాగుతుందని చెప్పారు. ముంబైలో జరిగిన బీజేపీ 'సమర శంఖారావం సభ'లో నరేంద్ర మోడీ కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు.
కాంగ్రెస్ పార్టీవి కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలేనని... వాటికి స్వస్తి పలకాలని మోడీ సూచించారు. అవినీతి అక్రమార్కులను కాంగ్రెస్ పార్టీ పెంచి పోషిస్తోందని అన్నారు. అయినా కాంగ్రెస్ నేతలు అవినీతికి వ్యతిరేకంగా మాట్లాడతారని... ఇది అత్యంత హాస్యాస్పదం అని ఎద్దేవా చేశారు. అవినీతిపరులు, అక్రమార్కులను ఏరిపారేసే సత్తా తనకుందని చెప్పారు.
క్విట్ ఇండియా ఉద్యమం పుట్టింది ముంబైలోనే అని మోడీ తెలిపారు. ముంబై తమకు పెద్దన్నలాంటిదని... గుజరాతీలకు ముంబై మరో నివాసంలాంటిదని మోడీ చెప్పారు. గుజరాత్ ఏర్పడక ముందు తాము కూడా మహరాష్ట్రలో భాగమే అని గుర్తుచేశారు. ఆరున్నర దశాబ్దాల స్వతంత్ర భారతావనిలో ఇప్పటికీ నీటి యుద్ధాలు జరుగుతున్నాయని విమర్శించారు. ముస్లింల కోసం కాంగ్రెస్ ఎన్నో పథకాలు ప్రారంభించిందని, కానీ, చేసిందేమీ లేదని మోడీ విమర్శించారు. బడుగు, బలహీన వర్గాలు, దళితులకు ఇప్పటికీ అభివృద్ధి ఫలాలు అందలేదని చెప్పారు. బీజేపీ దేశ అభివృద్ధికి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
ప్రభుత్వంలో ఉన్నప్పుడు నల్లధనాన్ని అరికట్టాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీపై లేదా? అని మోడీ ప్రశ్నించారు. నల్ల ధనాన్ని స్విస్ బ్యాంకుల్లో దాచుకుంటారన్న విషయం చిన్న పిల్లలకు కూడా తెలుసని చెప్పారు. అలాంటప్పుడు, విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని కాంగ్రెస్ పార్టీ ఎందుకు వెనక్కి రప్పించలేకపోతోందని ప్రశ్నించారు. బీజేపీ దృష్టిలో ప్రతి పేదవాడూ వీఐపీనే అని నరేంద్ర మోడీ తెలిపారు.
ఆదర్శ్ కుంభకోణంపై రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. భారత దేశంలో నిర్మిస్తున్నన్ని చిత్రాలు ప్రపంచంలో మరెక్కడా నిర్మించడం లేదని... అయినా దేశంలో చిత్ర పరిశ్రమకు ఒక్క యూనివర్శిటీ కూడా లేదని విమర్శించారు. సుపరిపాలన అందించేందుకే తాను వచ్చానని తెలిపారు. దేశంలో ఇప్పటిదాకా ఎన్నో ఎన్నికలు వచ్చాయిని... కానీ రానున్న ఎన్నికల్లో రేపటి కోసం కాకుండా, దేశంకోసం ఓటువేయాలని కోరుతున్నామని చెప్పారు. సుపరిపాలన మన జన్మహక్కని తెలిపారు. ఈ సభకు లక్షలాది మంది హాజరయ్యారు.