: అతిగా ఆస్ప్రిన్ తీసుకోవడం అంత మంచిది కాదట
గుండెపోటు, పక్షవాతం వంటి అనారోగ్యానికి సంబంధించిన సమస్యల్లో ధమనుల్లో గడ్డకట్టుకున్న రక్తాన్ని ఆస్ప్రిన్ కరిగిస్తుందని వైద్యులు చాలాకాలంగా నమ్ముతున్నారు. కానీ ఆస్ప్రిన్‌ను అదే పనిగా వాడడం వల్ల మేలుకన్నాకూడా కీడే ఎక్కువగా జరిగే అవకాశం ఉందని పరిశోధకులు గుర్తించారు. హృద్రోగాల నివారణకోసం రోజూ ఆస్ప్రిన్‌ను కొందరు వాడుతుంటారు. ఇలాంటి వారు ఎంత తక్కువగా ఆస్ప్రిన్‌ను వాడితే అంత మంచిదని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.
వార్విక్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు 2008 నుండి 2012 వరకూ మధ్యకాలంలో జరిపిన 27 పరిశోధనా పత్రాలను విశ్లేషించి ఆస్ప్రిన్‌ను ఎక్కువగా వాడడం వల్ల మేలుకన్నా కూడా కీడే ఎక్కువగా జరిగే అవకాశం ఉందని గుర్తించారు. ఈ విషయాన్ని గురించి పాల్ సట్క్లిఫే మాట్లాడుతూ ఆస్ప్రిన్ వాడకం వల్ల కలిగే లాభాలనే అందరూ చూస్తున్నారని, కానీ అతిగా వాడడం వల్ల కలిగే నష్టాలను గురించి ఎవరూ పట్టించుకోవడం లేదని అన్నారు. తమ విశ్లేషణలో ఈ విషయాన్ని గుర్తించామని, ఇందులో వైద్య శాస్త్రంలో అత్యున్నత ప్రామాణాలుగా భావించే 9 పరిశోధనా పత్రాలు కూడా ఉన్నాయని, ఈ విశ్లేషణలో రోజూ ఆస్ప్రిన్ వాడే ఆరోగ్యవంతుల్లో 37 శాతం మందికి అంతర్గత రక్తస్రావానికి సంబంధించి 38 శాతం మందికి హెమరాజిక్ స్ట్రోక్‌కు సంబంధించిన ప్రమాదం పెరిగిందని ఆయన చెబుతున్నారు.