: రాజీనామాకు సిద్ధంగా ఉన్న మరో పది మంది కేంద్ర మంత్రులు
కాంగ్రెస్ పార్టీ అంతర్మధనంలో పడింది. తాజా ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో ఘోర పరాభవం చవిచూసిన కాంగ్రెస్ పార్టీ నష్టనివారణ చర్యలకు పూనుకుంది. రాహుల్ ను పార్టీ వర్గాలు ప్రధాని అభ్యర్థిగా అనుకుంటుండడంతో జరుగుతున్న పరిణామాలన్నీ అతని తలకు చుట్టుకుంటున్నాయి. తాజా ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన వంటి అంశాలన్నీ కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా పరిణమించాయి. రాహులే కాదు, సాక్షాత్తూ సోనియా రంగంలోకి దిగినా పెద్దగా ఫలితం కన్పించడం లేదు.
రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్న లుకలుకలకు తోడు పెరిగిన ధరలు, చాలీ చాలని జీతాలు, అక్కరకు రాని పథకాలు కాంగ్రెస్ ప్రతిష్ఠను మసకబారుస్తున్నాయి. దీంతో తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చావు తప్పి కన్నులొట్టబోయింది. ఇదే అనుభవం పునారావృతం కాకుండా చూసుకునేందుకు పార్టీలోని కీలక నేతలకు పార్టీని పటిష్ఠం చేసే బాధ్యతను కాంగ్రెస్ అధినేత్రి అప్పగించనున్నారు.
అందులో భాగంగానే జయంతి నటరాజన్ రాజీనామా అని తెలుస్తోంది. ఆమె బాటలోనే మరో పది మంది కేంద్ర మంత్రులు కూడా పదవులకు రాజీనామాలు చేసి... పార్టీ కార్యకలాపాల్లో పాలుపంచుకునేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం. వీరిలో గులాంనబీ ఆజాద్, జైరాం రమేష్, ఏకే ఆంటోనీ, సల్మాన్ ఖుర్షీద్ వంటి పలువురు నేతలు ఉన్నారని సమాచారం.