: రాష్ట్రపతి ప్రతిష్ఠను దిగజార్చవద్దు: ఎంపీ పొన్నం
ప్రస్తుతం హైదరాబాదులో ఉన్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ఈ రోజు కరీంనగర్ ఎంపీ పొన్నం ప్రభాకర్ తన కుటుంబసభ్యులతో వెళ్లి కలిశారు. ఈ సందర్భంలో, తెలంగాణ బిల్లుపై రాష్ట్ర అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాలు, తాజా పరిస్థితులను ప్రణబ్ కు పొన్నం వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రపతి పంపిన ముసాయిదా బిల్లును అసెంబ్లీలో చింపి ఇప్పటికే ఆయన ప్రతిష్ఠకు భంగం కలిగించారన్నారు. ఇప్పుడు మళ్లీ ఆయనను కలిసి రాజకీయాలు మాట్లాడవద్దని పొన్నం సూచించారు. రాజకీయాల్లోకి రాష్ట్రపతిని లాగి ఆయన ప్రతిష్ఠను కించపర్చవద్దని కోరారు. తాను రాజకీయాలు మాట్లాడేందుకు రాష్ట్రపతిని కలవలేదని చెప్పారు.