: ఎన్నికల్లో లాభం కోసమే విభజన జరుగుతోంది: సబ్బం హరి
కేవలం ఎన్నికల్లో లాభం పొందేందుకే కేంద్ర ప్రభుత్వం విభజన అంటోందని కాంగ్రెస్ ఎంపీ సబ్బం హరి విమర్శించారు. ఏపీఎన్జీవోలతో అఖిలపక్ష సమావేశం ముగిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, సీమాంధ్రకు చెందిన ప్రజాప్రతినిధులెవ్వరూ బిల్లుకు అనుకూలంగా సంతకాలు చేయరని అన్నారు. పార్టీల్లోనే ప్రాంతాల వారిగా నేతలు విడిపోయారని అలాంటి పరిస్థితుల్లో పార్టీల అధ్యక్షులు ఎలా వారిని కట్టడి చేస్తారని అన్నారు.
అభిప్రాయాల అఫిడవిట్లను రాష్ట్రపతికి పంపిస్తామని ఆయన తెలిపారు. అవిశ్వాస తీర్మానానికి భయపడే రెండు రోజుల ముందే పార్లమెంటును మూసేసి పారిపోయారని ఆయన ఎద్దేవా చేశారు. సభ్యులపై చర్యలు తీసుకుంటే ప్రభుత్వం పడిపోతుందని ఆయన హెచ్చరించారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధుల్లో ఏ ఒక్కరూ తెలంగాణకు మద్దతు తెలపరని ఆయన వెల్లడించారు.
ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్న పార్టీలను తాము ప్రశ్నించలేమని సబ్బం అన్నారు. ప్రజాప్రతినిధుల అఫిడవిట్లు చూసిన తర్వాతైనా రాష్ట్రపతి స్పందిస్తారని అనుకుంటున్నామని ఆయన చెప్పారు.