: చెక్ పోస్టులపై ఏసీబీ పంజా.. లక్షల సొమ్ము స్వాధీనం
అవినీతికి అడ్డాగా మారిన ఆర్టీఏ చెక్ పోస్టులపై ఏసీబీ పంజా విసిరింది. గత అర్ధరాత్రి నుంచి ఏక కాలంలో వివిధ చెక్ పోస్టులపై దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో లెక్క తెలియని లక్షలాది రూపాయలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా పెదషాపూర్ చెక్ పోస్టులో రూ. 1.52 లక్షల అవినీతి సొమ్మును ఏసీబీ అధికారులు స్వాధీనపరుచుకున్నారు. అంతేకాకుండా ముగ్గురు అధికారులు, నలుగురు ప్రైవేట్ వ్యక్తులను అరెస్ట్ చేశారు. అనంతపురం జిల్లా పెనుకొండలో రూ. 54 వేలను స్వాధీనం చేసుకోవడంతోపాటు, అక్కడ పనిచేస్తున్న మోటార్ వెహికల్ ఇన్స్ పెక్టర్, కానిస్టేబుల్ తో పాటు మరో ముగ్గురు ప్రైవేట్ వ్యక్తులను అరెస్ట్ చేశారు. శ్రీకాకుళం పురుషోత్తపురం చెక్ పోస్టుపై దాడిచేసి ఏసీబీ అధికారులు రూ. 2.15 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ పనిచేస్తున్న ఐదుగురు ఉద్యోగులు, 15 మంది ప్రైవేటు వ్యక్తులను అరెస్ట్ చేశారు.
నెల్లూరు జిల్లా తడ చెక్ పోస్టులో లక్ష రూపాయల అవినీతి సొమ్మును గుర్తించారు. తూర్పుగోదావరి జిల్లా తేటగుంట చెక్ పోస్టులో రూ. 80 వేల సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు జిల్లాలోని ఓ చెక్ పోస్టులో లెక్కతేలని రూ. 65 వేలను గుర్తించారు. మరో విషయం ఏంటంటే... ప్రతి చెక్ పోస్టులో అవినీతి సొమ్మును వసూలు చేయడానికి ప్రైవేటు వ్యక్తులను నియమించుకున్నారు. ఈ దాడుల్లో అధికారులతో పాటు వారికి కలెక్షన్ ఏజెంట్లుగా పని చేసిన ప్రైవేటు వ్యక్తులపై కూడా కేసులు నమోదు చేసి అరెస్టులు చేశారు. వీరిపై శాఖాపరమైన చర్యలుంటాయని ఏసీబీ అధికారులు తెలియజేశారు.