: బిల్లుపై చర్చ ప్రారంభమైంది.. సీఎం విజ్ఞతకే వదిలేస్తున్నా: భట్టి విక్రమార్క
తెలంగాణ ముసాయిదా బిల్లుపై శాసనసభలో చర్చ ప్రారంభమైందని డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టివిక్రమార్క స్పష్టం చేశారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ ఈ నెల 11న జరిగిన బీఏసీ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారమే శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టామన్నారు. ఈ కీలక నిర్ణయంలో సీఎంతో పాటు ఇతర పార్టీల నేతలు కూడా భాగస్వాములేనని ఆయన పేర్కొన్నారు.
స్పీకర్ స్థానంలో ఉన్నవారు రాగద్వేషాలకు అతీతంగా విధులు నిర్వర్తిస్తారని ఆయన స్పష్టం చేశారు. సభలో చర్చ జరగకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విఘాతం కల్గించడమేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఇంకా చర్చ ప్రారంభం కాలేదని సీఎం చేసిన వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని భట్టి తెలిపారు. జనవరి 3 నుంచి జరిగే సమావేశాల్లో సభ్యులు తమ అభిప్రాయాలు స్వేచ్ఛగా తెలపాలని పిలుపునిచ్చారు.