: ఢిల్లీ గద్దెనెక్కేందుకు కేజ్రీ రెడీ!


మొత్తానికి కేజ్రీవాల్ తన అధికార దాహం తీర్చుకోనున్నారు. రాను రానంటూనే చిన్నదో.. చిన్నదీ.. రాములోరి గుడికొచ్చింది చిన్నదో చిన్నది... అంటూ ఒక సినీ కవి చెప్పిన రీతిలో.. కాంగ్రెస్, బీజేపీ మద్దతు తీసుకునేది లేదు లేదంటూనే కాంగ్రెస్ వెలుపలి మద్దతు దన్నుగా ఢిల్లీ ముఖ్యమంత్రి గద్దెపై కూర్చునేందుకు కేజ్రీవాల్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే, ఏదైనా ప్రజల తీర్పు మేరకేనంటూ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజాభిప్రాయ సేకరణ అంకానికి తెరతీసింది. అందులో ప్రజలు చెప్పినట్లు నడచుకుంటానని చెప్పింది. ప్రజాభిప్రాయాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ సోమవారం వెల్లడించనుంది. కానీ, ఆ లోపే ప్రజలమనసెరిగిన వాడిగా కేజ్రీవాల్ ఢిల్లీలో మెజారిటీ ప్రజలు ఆమ్ ఆద్మీయే అధికారం చేపట్టాలని, సమర్థవంతమైన పాలన ఇవ్వాలని కోరుకుంటున్నారని చెప్పారు. ఈ వారం చివర్లో వార్డు సమావేశాల అనంతరం తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

ఢిల్లీలో 70 స్థానాలకు గాను ఆమ్ ఆద్మీకి 28 స్థానాలు వచ్చాయి. కాంగ్రెస్ చేతిలో 8 ఉన్నాయి. వీరు కలిస్తే ప్రభుత్వ ఏర్పాటుకు సరిపడా బలం వస్తుంది. కానీ, కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏ సర్కారు అవినీతిపై నోరు చించుకునేలా విమర్శలు గుప్పించి.. అదే పార్టీ మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసి.. కేజ్రీవాల్ సూపర్ పాలన ఇవ్వగలరని ఢిల్లీ ప్రజలు ఆశించడం అత్యాశే అవుతుంది.

  • Loading...

More Telugu News