: నిప్పులు చెరిగి భళీ అనిపించిన బౌలర్లు


టీమిండియా బౌలర్లు భళీ అనిపించారు. చాలా కాలం తరువాత మంచి ప్రదర్శనతో భారత బౌలర్లు ఆకట్టుకున్నారు. మొదట్లో నిప్పులు చెరిగి టాపార్డర్ ను కకావికలం చేసిన టీమిండియా బౌలర్లు మరోసారి వారికే సాథ్యమైన రీతిలో టైలెండర్లను మాత్రం స్వేచ్ఛగా ఆడనిచ్చారు. మొదటి టెస్టులో రెండో రోజు సౌతాఫ్రికా జట్టు తడబడి నిలబడింది. రెండో రోజు ఆటమొత్తం అనూహ్యమలుపులు తిరుగుతూ ఆసక్తికరంగా కొనసాగింది.

ఓవర్ నైట్ స్కోరుకు 25 పరుగులు జతచేసిన టీమిండియా, కేవలం 16 పరుగుల తేడాలో 5 వికెట్లు కోల్పోవడంతో 280 పరుగులకు తొలి ఇన్నింగ్స్ ముగించింది. అనంతరం సౌతాఫ్రికా ధాటిగా బ్యాటింగ్ ప్రారంభించింది. కెప్టెన్ స్మిత్ సమర్థవంతమైన ఇన్నింగ్స్ కు ఆమ్లా తోడవడంతో వికెట్ నష్టానికి 130 పరుగులతో సౌత్ ఆఫ్రికా పటిష్ఠ స్థితిలో నిలిచింది. అప్పుడు టీమిండియా బౌలర్లు ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ అద్భుతం చేశారు. నిప్పులు చెరిగే బంతులతో వరుసగా ఆరు వికెట్లు తీశారు.

చివర్లో డూప్లెసిస్, ఫిలాండర్ లు నిలదొక్కుకుని చూడ చక్కని భాగస్వామ్యంతో సఫారీలను ఆదుకున్నారు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి సౌతాఫ్రికా ఆరు వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. మరి కాసేపట్లో మూడో రోజు ఆట ప్రారంభం కానుంది. ఇషాంత్ మూడు వికెట్లు తీయగా షమీ రెండు వికెట్లతో రాణించాడు. జహీర్ ఖాన్ ఒక్క వికెట్ తీసి వారికి చక్కని సహకారం అందించాడు.

  • Loading...

More Telugu News