: మన ఆహారంతోనే జబ్బులను దూరం చేసుకోవచ్చు
మనం రోజువారీ తీసుకునే ఆహారంతోనే ఎలాంటి జబ్బులను రాకుండా, వాటిని మనకు దూరంగా ఉంచవచ్చు. ఈ విషయం మనందరికీ తెలిసినా పెద్దగా పట్టించుకోము. ముఖ్యంగా మహిళలు మాత్రం వారి ఆరోగ్యం గురించి పెద్దగా శ్రద్ధ చూపించరు. ఇంట్లో ఇతర కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి తీసుకున్న శ్రద్ధ వారి ఆరోగ్యం విషయంలో చూపరు. కానీ వారు కూడా తమ ఆరోగ్యం గురించి కాస్త శ్రద్ధ వహించాల్సి ఉంది. ముఖ్యంగా నెలసరి నిలిచిన మహిళలు టమోటాలను ఎక్కువగా తీసుకుంటే రొమ్ము క్యాన్సర్ ముప్పు నుండి తప్పించుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. పరిశోధకులు తాజాగా నిర్వహించిన అధ్యయనంలో టమోటాలు రొమ్ము క్యాన్సర్ ముప్పును తగ్గించడంలో బాగా తోడ్పడుతున్నట్టు తేలింది.
నెలసరి నిలిచిన మహిళల్లో శరీర బరువు, ఎత్తుల నిష్పత్తి పెరుగుతుంది. దీంతో ఇలాంటి వారికి రొమ్ము క్యాన్సరు ముప్పు కూడా పెరుగుతుంది. ఇలాంటి వారు టమోటాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల కొవ్వు, చక్కెర జీవక్రియలను నియంత్రించడంలో పాలుపంచుకునే అడిపోనెక్టిన్ హార్మోన్ స్థాయిలు 9 శాతం పెరిగినట్టు రట్‌గర్స్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు తమ పరిశోధనలో గుర్తించారు. ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన అడానా లానోస్ మాట్లాడుతూ టమోటాలను, టమోటాలతో చేసిన పదార్ధాలను తక్కువకాలం తీసుకున్న వారిలో కూడా దాని ప్రభావం చాలా స్పష్టంగా కనిపిస్తుందని తెలిపారు.
అలాగే నెలసరి నిలిచిన మహిళలు అత్యవసర పోషకాలు, విటమిన్లు, ఖనిజాలతోబాటు లైకోపేస్ వంటి ఫైటోకెమికల్స్ నిండిన కూరగాయలు, పండ్లు తీసుకోవడం వల్ల బోలెడు లాభాలున్నాయని అడానా వివరించారు. ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్ ముప్పు ఎక్కువగా ఉండేవారు మాత్రం రోజూ పండ్లు, కూరగాయలను తీసుకుంటే రొమ్ముక్యాన్సరు ముప్పును చాలా వరకూ నివారించుకునే వీలుంటుందని ఈ అధ్యయనం ద్వారా స్పష్టంగా తెలుస్తోంది.