: కాసేపట్లో వినూత్న రీతిలో మహేష్ బాబు '1-నేనొక్కడినే' ఆడియో విడుదల
మహేష్ బాబు '1-నేనొక్కడినే' సినిమా ఆడియో కాసేపట్లో హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో విడుదల కానుంది. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ ను గతంలో ఎన్నడూ జరగని విధంగా వినూత్న రీతిలో నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన సినిమా థియేటర్లలో అభిమానుల కోసం ఈ కార్యక్రమాన్ని లైవ్ గా ప్రదర్శించనున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పలు సినిమా హాళ్ల వద్ద ఆడియో విడుదల కార్యక్రమాన్ని చూసేందుకు... మహేష్ బాబు అభిమానులు సందడి చేస్తున్నారు.
14-రీల్స్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమాలో అన్నీ విశేషాలే.. మహేష్ బాబు కుమారుడు గౌతమ్ కూడా ఈ సినిమాలో నటించడం విశేషం కాగా, మహేష్ బాబు సిక్స్ ప్యాక్ తో సందడి చేశాడు. సూపర్ మోడల్ కృతి సనన్ హీరోయిన్ గా తొలిసారి నటిస్తుండగా, సుకుమార్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు సంగీతాన్ని దేవీశ్రీప్రసాద్ అందించాడు. సినిమాల ప్రచారంలో పెద్దగా కల్పించుకోని మహేష్ బాబు ట్విట్టర్లో '1-నేనొక్కడినే' సినిమా గురించి ఆసక్తికరంగా చర్చించారు. మరోవైపు సమంతా చేసిన వ్యాఖ్యల దుమారం ఈ సినిమాపై మరింత ఆసక్తిరేపింది.