: భారత్ కు క్షమాపణలు చెప్పిన అమెరికా
దౌత్యవేత్త దేవయాని ఖోబ్రాగాడేపై కుట్ర జరిగిందని, ఆమె పట్ల అనుచిత ప్రవర్తనకు అమెరికా క్షమాపణలు చెప్పాలని భారత పార్లమెంటు చేసిన డిమాండ్ కు అగ్రరాజ్యం దిగొచ్చింది. అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ భారత జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్ కు ఫోన్ చేసి జరిగిన దానికి క్షమాపణలు తెలిపారు. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మేరీ హాఫ్ తెలిపారు.
ఖోబ్రాగాడే విషయంలో అమెరికన్ పోలీసుల తీరు క్షమించరానిది, అనాగరికమైనదిగా శివశంకర్ మీనన్ రెండు రోజుల క్రితం వ్యాఖ్యానించారు. దీనిపై మీడియాతో మాట్లాడిన మేరీ హాఫ్.. విదేశీ దౌత్యవేత్తల పట్ల మర్యాదగా నడచుకోవాలని జాన్ కెర్రీ అభిప్రాయపడుతున్నారని చెప్పారు. జరిగిన దానిపట్ల శివశంకర్ మీనన్ ముందు విచారం వ్యక్తం చేశారని, ఈ సంఘటన రెండు దేశాల సంబంధాలకు విఘాతం కాబోదనే ఆశాభావంతో ఉన్నారని పేర్కొన్నారు.
ఒకవైపు భారత దౌత్యవేత్త పట్ల వ్యవహరించిన తీరుపై అమెరికా విదేశాంగ మంత్రి క్షమాపణలు వ్యక్తం చేస్తే.. మరోవైపు అసలు ఆమె పట్ల సరిగానే వ్యవహరించామని, బహిరంగంగా సంకెళ్లు వేసి తీసుకు వెళ్లలేదని కేసును వాదిస్తున్న ఆ దేశ అటార్నీ, భారత సంతతికి చెందిన ప్రీత్ భరారా సమర్థించుకోవడం అగ్రరాజ్య నైజానికి నిదర్శనం. అయితే, బట్టలిప్పి శోధించడం అనేది నిబంధనల ప్రకారమే జరిగిందని.. దీన్ని మహిళా మార్షల్ నిర్వహించారని ఆమె తెలిపారు.