: మరో మూడు రోజుల్లో పెళ్లనగా పెట్రోలు పోసి నిప్పంటించాడు!
ప్రేమ పేరుతో జరుగుతున్న అకృత్యాలకు ఎందరో యువతులు బలైపోతున్నారు. మరో మూడు రోజుల్లో పెళ్లనగా యువతిపై పెట్రోలు పోసి నిప్పంటించాడో ప్రేమ పిశాచి. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురానికి చెందిన రేవతి పదో తరగతి చదువుతోంది. ఆ బాలికను ప్రేమిస్తున్నానంటూ నవీన్ అనే పెయింటర్ వెంటపడి వేధించేవాడు. అతడి ప్రేమను తిరస్కరించిన రేవతి ఇంట్లో పెద్దలకు విషయం చెప్పింది. దీంతో పెద్దలు అతనిని తీవ్రంగా మందలించారు.
ఈ క్రమంలో రేవతికి పెళ్లి కుదిరింది. పెళ్లికి మరో మూడు రోజులే సమయం ఉండడంతో ఇంట్లో పెద్దలంతా పెళ్లి పనులమీద బయటకు వెళ్లారు. కొంతకాలంగా రేవతికి దూరంగా ఉంటున్న నవీన్ అదే అదనుగా భావించి ఇంట్లోకి వచ్చి ఆమెపై పెట్రోలు పోసి నిప్పంటించి పారిపోయాడు.
రేవతి ఇంట్లోంచి కేకలు, అరుపులు పెట్టడంతో స్థానికులు నీళ్లు పోసి, దుప్పట్లు కప్పి మంటలు ఆర్పి, బాలికను ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటికే రేవతికి 60 శాతం గాయాలయ్యాయి. ఆమె కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతోంది. నవీన్ కోసం రెండు ప్రత్యేక బృందాలతో పోలీసులు గాలింపు చేపట్టారు.