: రాజకీయ లబ్ధి, అధికారం కోసమే కాంగ్రెస్ ఆరాటపడుతోంది: సుజనా చౌదరి
ఉమ్మడి రాజధాని, గవర్నర్ పాలన అనే అంశాలు రాజ్యాంగంలో ఎక్కడా లేవని తెలుగుదేశం పార్టీ ఎంపీ సుజనా చౌదరి అన్నారు. న్యూఢిల్లీలో ఇవాళ సుజనా చౌదరి మీడియాతో మాట్లాడారు. కేవలం వచ్చే ఎన్నికల్లో ఓట్ల కోసమే విభజన ప్రక్రియను కాంగ్రెస్ ముందుకు తీసుకెళుతోందని.. ప్రజల ఆకాంక్షలను పట్టించుకోకుండా రాజకీయ లబ్ధి కోసమే కాంగ్రెస్ పాకులాడుతోందని ఆయన తేల్చి చెప్పారు. శ్రీకృష్ణ కమిటీ సిఫార్సులను బుట్టదాఖలు చేశారని ఆయన అన్నారు. మూడో అధికరణాన్ని ( ఆర్టికల్ 3) ఉపయోగించి రాష్ట్రాలను విభజించడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.
సీఎం కిరణ్ సమైక్య నినాదంతో ప్రజలను మభ్యపెడుతున్నారని.. వైఎస్ జగన్ బయటకు సమైక్యవాదం అంటూనే, లోపల విభజన వాదం వినిపిస్తున్నారని చౌదరి చెప్పారు. లోక్ పాల్ బిల్లు కూడా కంటితుడుపు చర్యేనని.. ప్రజల్లో వ్యతిరేకత రాకుండా జాగ్రత్త పడేందుకే బిల్లును పాస్ చేశారని ఆయన అన్నారు.