: వారే ఆందోళనలు చేయించి.. సభను వాయిదా వేశారు: లగడపాటి
ఒక ప్లాన్ ప్రకారం కాంగ్రెస్ అధిష్ఠానం లోక్ సభలో ఆందోళనలు చేయించి... సభను నిరవధికంగా వాయిదా వేయించిందని విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ విమర్శించారు. దీన్ని తాము ముందుగానే ఊహించి, కుయుక్తులతో సభకు ఆటంకం కల్గిస్తున్న వారిని సస్పెండ్ చేయండని స్పీకర్ కు ముందే లేఖ ఇచ్చామన్నారు. దేశ చరిత్రలోనే ప్రజాస్వామ్యానికి ఈ రోజు చీకటి రోజన్నారు. స్పీకర్ కూడా అధికారపక్షానికి చెందిన వ్యక్తి అనిపించుకునేలా ప్రవర్తించారని దుయ్యబట్టారు.
శీతాకాల సమావేశాల్లో పార్లమెంటుకు బిల్లు వస్తుందని, జనవరి ఒకటి నాటికి ఇద్దరు ముఖ్యమంత్రులు ఉంటారని భావించిన కొంత మంది అప్పుడే కొత్త బట్టలు కూడా కుట్టించుకున్నారని ఎద్దేవా చేశారు. ఎప్పుడు ముఖ్యమంత్రి అవుదామా అని కొందరు ఎదురు చూస్తున్నారని, కానీ వారి ఆశలను వమ్ముచేస్తూ ఇప్పటికీ రాష్ట్రం ఒక్కటిగానే ఉందని అన్నారు. వారి అంచనాలను తలకిందులు చేస్తూ... ఇప్పుడు శీతాకాల సమావేశాలు ముగిసిపోయాయని అన్నారు.
తెలంగాణ బిల్లుకు రాష్ట్రపతి కేవలం మూడు రోజుల సమయం మాత్రమే ఇస్తారని అన్నారని... కానీ, ఇప్పుడు రాష్ట్రపతి ఆరు వారాల సమయం ఇచ్చారని... దానిని వినియోగించుకోవాలని కోరారు. ఆ సమయం సరిపోకపోతే మరో నాలుగు వారాల సమయం కోరదామని అన్నారు. క్రిస్ట్ మస్, సంక్రాంతి వంటి సెలవులున్నాయని... దీనికితోడు, ప్రతి సభ్యుడు చర్చించడానికి సమయం పడుతుందని, అందుకని చర్చకు సహకరించాలని టీడీపీ, వైఎస్సార్సీపీ నేతలకు సూచించారు.
వ్యక్తిగత అభిప్రాయాలు, అసెంబ్లీ అభిప్రాయం కూడా రాష్ట్రపతి అడిగారని లగడపాటి తెలిపారు. జూలై 30 నుంచి ఇప్పటి వరకు తెలంగాణ బిల్లు అసెంబ్లీకి రాకుండా తాము అడ్డుకున్నామని అన్నారు. ఎంపీలం రాజీనామాలు చేస్తామని చెప్పి మరో రెండు నెలలు ఆపామన్నారు. టీడీపీ, వైఎస్సార్సీపీలు మొండిగా చర్చను అడ్డుకోవడం సరికాదని అన్నారు. 371 డీ రాజ్యాంగ సవరణ లేకుండా విభజన సాధ్యం కాదని లగడపాటి అన్నారు.