: అసెంబ్లీ నిరవధిక వాయిదా?
అసెంబ్లీలో టీబిల్లుపై చర్చ అంశం కీలక మలుపు తిరగబోతున్నట్టు కనిపిస్తోంది. రేపట్నుంచి అసెంబ్లీని నిరవధికంగా వాయిదా వేయాలనే నిర్ణయానికి స్పీకర్ నాదెండ్ల మనోహర్ వచ్చినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. అనేక కారణాల నేపథ్యంలో, ఆయన ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. రాష్ట్రానికి వచ్చిన టీ ముసాయిదా బిల్లులో చాలా లోపాలున్నాయని, సమగ్ర సమాచారం లేదంటూ పలు పార్టీలు స్పీకర్ కు లేఖాస్త్రాలు సంధించాయి.
దీనికి తోడు, సమైక్య తీర్మానం కోసం సీమాంధ్ర ఎమ్మెల్యేలు, విభజన బిల్లుపై చర్చకు తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు పట్టుబడుతూ... పోటాపోటీగా సభలో గందరగోళం సృష్టిస్తుండటంతో, సభ నడవలేని పరిస్థితులు నెలకొన్నాయి. దీనికితోడు, సీఎం కిరణ్ రేపు అఖిలపక్షంతో కలసి బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ పై ప్రధానితో చర్చించేందుకు ఢిల్లీ వెళుతున్నారు. అంతేకాకుండ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ శీతాకాల విడిది కోసం రేపు హైదరాబాద్ రానున్నారు. ఈ నేపథ్యంలో, సభను కొనసాగించడం కంటే నిరవధికంగా వాయిదా వేయడమే మేలన్న అంచనాకు స్పీకర్ నాదెండ్ల మనోహర్ వచ్చినట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే రేపట్నుంచి సభ నిరవధికంగా వాయిదా పడుతుంది.