: వారి తప్పులు బయటపడతాయనే టీడీపీని టార్గెట్ చేస్తున్నారు: నారా లోకేష్
రాజకీయ నాయకుల అవినీతి వల్లే యువత ఉద్యోగావకాశాలు కోల్పోయి నిరుద్యోగులవుతున్నారని టీడీపీ యువనేత నారా లోకేష్ అన్నారు. రాష్ట్రంలో పెరిగిన ఆదాయం స్థాయిలో ఉద్యోగావకాశాలు ఎందుకు పెరగలేదని లోకేష్ ప్రశ్నించారు. ఈ రోజు హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్ లో టీఎన్ఎస్ఎఫ్ సమావేశాన్ని ఆయన ప్రారంభించి, ప్రసంగించారు. 2004 తర్వాత ఫ్యాబ్ సిటీలో ఒక్కరికైనా ఉద్యోగం వచ్చిందా? అని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టాలంటే ప్రతి ఒక్కరూ లంచాలు అడుగుతున్నారని దుయ్యబట్టారు.
తమ అధినేత చంద్రబాబు అధికారంలోకి వస్తే వారి తప్పులు బయటపడతాయని... అన్ని పార్టీలు టీడీపీని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నాయని లోకేష్ ఆరోపించారు. పదేళ్ల కాంగ్రెస్ పరిపాలనలో చంద్రబాబుపై 37 కేసులు పెట్టినా... ఏ ఒక్కదాన్ని కూడా నిరూపించలేక పోయారని అన్నారు. ఉత్తరాఖండ్ వరదల్లో వందలాది మంది తెలుగువారు చిక్కుకున్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీనే ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసి బాధితులను రాష్ట్రానికి చేర్చిందని తెలిపారు. నేడో, రేపో జైలుకెళ్లే నేత కావాలో, చంద్రబాబు కావాలో అనే దిశలో టీఎన్ఎస్ఎఫ్ సమావేశాలు జరగాలని ఆయన సూచించారు.