: నాగార్జున వర్సిటీలో కామ ప్రొఫెసర్
విద్యాలయాల్లోనూ లైంగిక వేధింపులు పెరిగిపోతున్నాయి. విద్యార్థినులపై ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లు లైంగిక వేధింపులు, అకృత్యాలకు పాల్పడుతూ భద్రతను, నైతిక విలువలను ప్రశ్నార్థకం చేస్తున్నారు. తాజాగా గుంటూరులోని నాగార్జున వర్సిటీలో ఒక కాంట్రాక్టు ప్రొఫెసర్ ఇంజనీరింగ్ విద్యార్థినిపై లైంగిక వేధింపులకు తెరతీశాడు. విజయనగరానికి చెందిన విద్యార్థిని వర్సిటీలో మెకానికల్ ఇంజనీరింగ్ రెండో సంవత్సరం చదువుతోంది. ఇదే వర్సిటీలో కాంట్రాక్టు ప్రొఫెసర్ కృష్ణకిషోర్ సదరు విద్యార్థినితో మాట్లాడాలి, ఒక్కదానివే రావాలని ఈ నెల 15న మొబైల్ కు మెసేజ్ పంపాడు.
మరుసటి రోజు వేరొక విద్యార్థినితో కలిసి వెళ్లింది. వెంట వచ్చిన విద్యార్థినిని బయటే ఉంచిన కృష్ణకిషోర్ తాను పిలిపించిన విద్యార్థిని ఒక్కదాన్ని లోపలకు తీసుకెళ్లి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఆమె ఫొటోతో మార్ఫింగ్ చేసిన నగ్న చిత్రాలు చూపించాడు. దీంతో ఆమె అక్కడి నుంచి తప్పించుకుని బయటపడింది. జరిగిన విషయాన్ని ప్రిన్సిపాల్ కు, తల్లిదండ్రులకు తెలియజేసింది. నిన్న తండ్రితో కలిసి గుంటూరు పట్టణ సమీపంలోని పెదకాకాని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.