: కళ్లకు సేదతీర్చే దిండ్లు వచ్చాయ్!


తలగడలు తలకింద మెత్తగా ఉంటూ మనకు కాస్త సాంత్వన కలిగిస్తాయి. అలాగే, బాగా అలసిన మన కళ్లకు కూడా సాంత్వన కలిగించే చిన్నసైజు దిండ్లు ఇప్పుడు మార్కెట్లో మనకు లభిస్తున్నాయి. ఇవి చూసేందుకు చిన్నవిగానే ఉన్నా వీటితో బోలెడన్ని ప్రయోజనాలు ఉన్నాయట. మన కళ్లకే కాదు, మన తలకు కూడా అలసటను తీర్చే ఈ ఐ పిల్లోస్‌తో పని ఒత్తిడి, చికాకు చక్కగా దూరమవుతాయని నిపుణులు చెబుతున్నారు.

లావెండర్‌, అవిసె గింజలతో తయారుచేసిన ఈ ఐ పిల్లోస్‌ని కాసేపు ఫ్రిజ్‌లో ఉంచి అలసిన కళ్లమీద పెట్టుకుని అరగంటపాటు కదలకుండా పడుకుంటే చక్కగా కళ్లు సేదతీరుతాయి. అలాగే నిద్రలేమితో బాధపడేవారికి కూడా ఈ చిట్కా బాగా పనిచేస్తుంది. ఈ దిండ్లలో ఉండే అరోమా వాసనలు నరాలమీద ప్రభావం చూపుతాయి. తలనొప్పిగా ఉన్న సమయంలో ఈ దిండును చక్కగా కాసేపు ఓవెన్‌లో ఉంచి తర్వాత నుదుటిపై పెట్టుకుంటే చక్కటి ఫలితం ఉంటుంది. జలుబు, దగ్గుతో బాధపడేవారు యూకలిప్టస్‌ ఐ పిల్లోని ఎంచుకుని దాన్ని ఉపయోగిస్తే సమస్యను తగ్గించుకోవచ్చు. కంప్యూటర్‌ ముందు ఎక్కువ సమయం గడిపేవారు కూడా ఇలాంటి పిల్లోస్‌ని వాడడం వల్ల కళ్లు సేదతీరుతాయి. కళ్లకు వేసుకున్న మేకప్‌ తొలగించిన తర్వాత చల్లటి ఐ పిల్లోని ఓ అరగంటపాటు కళ్లపై ఉంచుకుంటే కళ్లకు మేకప్‌ వల్ల వచ్చే ఇన్‌ఫెక్షన్లు కూడా తగ్గుతాయి. చిన్న ఆకారంలో లభించే ఐ పిల్లోస్‌ వాడడం వల్ల అలసట, నిద్రలేమి, కళ్లమంట, దురద వంటి సమస్యలను తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News