: పూర్తి సమాచారం ఇవ్వకపోతే సభను జరగనివ్వం: పయ్యావుల


తెలంగాణ ముసాయిదా బిల్లును చర్చకు తేవడంపై టీడీపీ నేత పయ్యావుల కేశవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాచారం ఎవరికీ అందుబాటులో లేకుండా ఎలా చర్చిస్తారు, ఏ అంశం మీద చర్చిస్తారని ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ, సీమాంధ్ర ప్రజలకు రాష్ట్ర విభజనపై పూర్తి సమాచారం అందించాల్సిన అవసరం తమ మీద ఉందని ఆయన స్పష్టం చేశారు.

ముసాయిదా బిల్లులో ఉన్న అన్ని అంశాల మీద పూర్తి సమాచారం శాసన సభ సభ్యులకు అందజేయాలని... ఆ తరువాతే చర్చకు సిద్ధపడాలని ఆయన అన్నారు. రాష్ట్రంలో ఉన్న ఆస్తుల మీద, హక్కుల మీద సమగ్ర సమాచారం అందజేయాలని... నిపుణులతో మదింపు చేసి ఆస్తుల లెక్కలు తేల్చాలని డిమాండ్ చేశారు.

అలాగే హైదరాబాద్ లో, రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులు ఎంతమంది? విద్యారంగ సంస్థలు ఎన్ని? హైదరాబాద్ లో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు ఎన్ని? విభజన తరువాత సీమాంధ్ర విద్యార్థుల ఉద్యోగావకాశాలు ఏంటి? హైదరాబాద్ చుట్టుప్రక్కల ఉన్న చిన్నా, పెద్ద పరిశ్రమలు ఎన్ని? ప్రాజెక్టుల పరిస్థితి ఏంటి? నీటి కేటాయింపులు ఎలా? విద్యుత్ సంస్థలు ఎన్ని ఉన్నాయి? విద్యుత్ అవసరాలు ఏంటి? విద్యుత్ వినియోగం ఎంత? వంటి అంశాలన్నింటిపైనా పూర్తి సమాచారం అందుబాటులో పెట్టండి అని సూచించారు.

పూర్తి సమాచారం అందుబాటులోకి తేవడం వల్ల ప్రజలకు కూడా పూర్తిగా తెలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆ తరువాత అన్ని అంశాలపైనా సమగ్రంగా చర్చిద్దామని సూచించారు. 'స్పీకర్, సీఎం, డిప్యుటీ స్పీకర్ వంటి వారందర్నీ కోరుతున్నా.... మా ప్రజలకు వాస్తవాలు వివరించండి' అని అన్నారు. అంతవరకు చర్చకు సమాయత్తమయ్యే సమస్యే లేదని, సభను సజావుగా సాగనిచ్చేది లేదని సవాలు చేశారు. తమకు పూర్తి సమాచారం తెలుసుకునే హక్కు ఉందని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News