: భారత దౌత్యవేత్తకు మోడీ, రాహుల్, షిండే బాసట
అమెరికాలో అరెస్టయిన భారత దౌత్యవేత్త దేవయాని ఖోబ్రాగాదెకు దేశీయంగా మద్దతు పెరుగుతోంది. ఆమె పట్ల అమెరికన్ పోలీసులు అగౌరవంగా, అనాగరికంగా వ్యవహరించడంపై ప్రముఖ నేతలు తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. భారత్ కు వచ్చిన అమెరికన్ కాంగ్రెస్ సభ్యుల బృందంతో భేటీ అయ్యేందుకు కేంద్ర హోం మంత్రి షిండే, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ నిరాకరించారు.
దీనిపై మోడీ ట్విట్టర్లో స్పందించారు. 'జాతి సమగ్రతలో భాగంగా దేశంలో పర్యటిస్తున్న అమెరికా బృందంతో భేటీ అయ్యేందుకు నిరాకరించా. అమెరికాలో మన దేశ మహిళ పట్ల వ్యహరించిన అనాగరిక తీరును నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నాను' అని మోడీ ట్వీట్ చేశారు. ఇప్పటికే స్పీకర్ మీరాకుమార్, జాతీయ భద్రతా సలహాదారు శివశంకర్ మీనన్ కూడా అమెరికన్ ప్రతినిధులతో సమావేశమయ్యేందుకు నిరాకరించిన విషయం తెలిసిందే. మరోవైపు అమెరికా చర్యకు నిరసనగా భారత్ లోని అమెరికన్ దౌత్యవేత్తలు అందరూ తమ ఐడీ కార్డులను స్వాధీనం చేయాలని కేంద్ర ప్రభుత్వం కోరినట్లు సమాచారం.