: చాలామందికి తినడం మాత్రమే తెలుసునట!
మనలో చాలామందికి మార్కెట్‌లో బోలెడు వస్తువులను కొనుగోలుచేసి తినడం మాత్రమే తెలుసునట. అంతేగానీ అవి ఎక్కడినుండి వస్తాయి? అనే విషయం గురించి అస్సలు అవగాహన లేదట. చిన్న చిన్న విషయాలను గురించి కూడా మనలో చాలామందికి సరైన అవగాహన లేదు అనే విషయాన్ని పరీక్షించాలని భావించి లింకింగ్ ఎన్విరాన్‌మెంట్ అండ్ ఫార్మింగ్ (లీఫ్) అనే ఒక స్వచ్ఛంద సంస్థ వారు ఒక ప్రత్యేక సర్వే చేపట్టారు. ఈ సర్వేలో మనవారు చాలామంది కనీసం కోడిగుడ్డు ఎక్కడినుండి వస్తుందో కూడా తెలియనంత అజ్ఞానంతో ఉన్నారని తేలిందట.
లీఫ్ సంస్థ వారు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో 16 నుండి 23 ఏళ్ల మధ్య వయసున్న యువతీ యువకులతో ఒక ప్రత్యేక సర్వేను నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా యువతలో పర్యావరణ విషయాల గురించి అవగాహన పెంపొందించే పనిలో భాగంగా వీరు చేపట్టిన ఈ సర్వేలో బోలెడన్ని ఆసక్తికరమైన విషయాలు తేలాయి. ఈ సర్వేలో పాల్గొన్న చాలామందికి అత్యంత సాధారణ అంశాల గురించి కూడా అవగాహన లేదని తేలిందట. ఎంత అవగాహనారాహిత్యమంటే ప్రతి పదిమందిలో ఒకరికి కోడిగుడ్డు ఎలా వస్తుంది? అనే విషయం కూడా తెలియదట.
కొందరు ప్రబుద్ధులైతే ఎగ్ గోధుమగడ్డికి కాస్తుంది కదా? అని కూడా ఎదురు ప్రశ్నించారట. ఇంకా వెన్న గురించి అడిగితే 24 శాతంమంది తమకు తెలియదని స్పష్టంగా చెప్పేశారట. 15 శాతం మందికి కిచెన్‌లోకి చికెన్ ఎలా వస్తోందంటే తమకు దానిపై అవగాహన లేదని చెప్పారట. అంటే రోజూ మార్కెట్‌కు వెళ్లి, లేదా హోటల్‌కు వెళ్లి తమకు నచ్చినవి ఆర్డర్ ఇచ్చి కుమ్మేయడమేగానీ, అసలు అది ఎక్కడినుండి వస్తోంది అనే విషయంపై కాసింతైనా అవగాహన లేకుండా మనవాళ్లు చాలామంది రోజులు దొర్లించేస్తున్నారన్నమాట!