: ఇదో వెరైటీ టూ వీలర్
టూ వీలర్ అంటే ముందొక చక్రం, వెనుకో చక్రం ఉండి, రయ్యిమని ముందుకు దూసుకెళుతూ ఉండేది. అలా కాకుండా రెండు చక్రాలూ పక్కపక్కనే ఉంటూ రయ్యిమని ముందుకు వెళితే దాన్ని కూడా టూ వీలర్ అనే కదా అనాలి. ఇలాంటి ఓ వెరైటీ టూ వీలర్‌ను తయారుచేయాలనే ఆలోచన వచ్చింది పరిశోధకులకు. వెంటనే ఒక వెరైటీ టూ వీలర్‌ను తయారుచేసేశారు. ముందు, వెనుక చక్రాలు ఉంటే కొందరు సరిగ్గా బ్యాలెన్స్ చేయలేరు. ఇలాంటి వారికి ఈ స్కూటర్ బాగా పనికొస్తుందట. దీనిపేరు జీరో స్కూటర్.
ఒక్కరు మాత్రమే చక్కగా ఎక్కి వెళ్లగలిగిన ఈ జీరో బైక్‌ను బైక్ డిజైనర్లు రూపొందించారు. ఈ బైక్‌ను బ్యాలెన్స్ చేయడం సులభం. దీనిపై గరిష్టంగా 20 మైళ్ల వేగంతో ఏకధాటిగా 30 నుండి 35 కిలోమీటర్ల దూరం వరకూ ప్రయాణించవచ్చు. 51 కేజీల బరువుండే ఈ బైక్ ద్వారా 180 కేజీల బరువును తీసుకెళ్లవచ్చు. లిథియం బ్యాటరీ ద్వారా నడిచే ఈ బైక్ ధర దాదాపుగా నాలుగువేల డాలర్లు. చూడడానికి భలేగా ఉండే ఈ బైక్‌ను ఏ పెద్ద బైకుల కంపెనీ ఉత్పత్తి చేసిందో అనుకుంటున్నారా... అదేంలేదు. వెస్పా బైక్‌ను రీ మాడిఫైచేసి దీన్ని తయారుచేశారు. నేలనుండి 30 డిగ్రీల కోణంలో ఉన్న రోడ్డుపై కూడా ఈ బైక్ రయ్యిమని దూసుకెళ్లగలదు. అంతేకాదు దీన్ని 360 డిగ్రీల్లో కూడా చటుక్కున టర్న్ చేయవచ్చు. ఇక తమకు బైక్ నడపడం రాదనుకునేవారు ఎంచక్కా ఇలాంటి బైక్‌ను కొనేసుకుని రయ్యిమని తిరిగేయండిమరి.