: సభ్యుల హక్కులను భంగపరచిందెవరు?: టీడీపీ నేత ధూళిపాళ్ల సూటి ప్రశ్న


'సభలో గందరగోళ పరిస్థితులు చేటు చేసుకోవడానికి కారకులెవరు? కొంత మంది సభ్యులకు సమాచారం ఇచ్చి మిగిలిన సభ్యుల హక్కులకు భంగం కలిగించింది ఎవరు?' అని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర ప్రశ్నించారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన టీడీపీ సభ్యులమంతా స్పీకర్ పోడియం వద్దే బైఠాయించామన్నారు. సభ ఆర్డర్ లో లేనప్పుడు తెలంగాణ బిల్లు ఎలా ప్రవేశపెడతారు? అని నిలదీశారు. బీఏసీ సమావేశంలో జరిగిన అంశాలను మంత్రి శ్రీధర్ బాబు వక్రీకరించి మాట్లాడుతున్నాడని విమర్శించారు.

గతంలో కూడా పలు రాష్ట్రాల్లో విభజనలు జరిగాయని, అయితే ఇంత క్రూరంగా ఎక్కడా జరగలేదని ఆయన మండిపడ్డారు. 'రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది. ఆర్టికల్ 3 మీద వివరణ కావాలి' అని అడిగితే దానికి సమాధానం లేదని దుయ్యబట్టారు. న్యాయపరమైన అంశాలపై బీఏసీలో చర్చించామని, అయితే అక్కడ తీసుకున్న నిర్ణయాలు వేరు, సభలో జరిగిన అంశాలు వేరని అన్నారు. అధికార పక్షం తీరు సభని పరిహసించే విధంగా ఉందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

సభాపతి స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ నిబంధనలను తుంగలో తొక్కారని ఆయన ఆరోపించారు. 'ప్రజాస్వామ్యపద్దతిలో సభను సాగనివ్వాలి. అలాగే శాసనసభలో మెజారిటీ సభ్యుల అభిప్రాయాలు పరిగణనలోకి తీసుకోవాలి. కానీ ఇక్కడ అలా జరగడం లేదు. దీనిని ఖండిస్తున్నాం' అని ధూళిపాళ్ల స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News