: బిల్లు ప్రవేశపెట్టండి.. లేకపోతే రాష్ట్రపతిని అవమానించినట్టే: కేసీఆర్


శాసన సభలో వెంటనే టీబిల్లును ప్రవేశపెట్టి, చర్చను చేపట్టాలని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ డిమాండ్ చేశారు. లేకపోతే అది రాష్ట్రపతిని అవమానించినట్టే అవుతుందని అన్నారు. రాష్ట్రపతి నుంచి వచ్చిన సమాచారాన్ని స్పీకర్ వెంటనే టేబుల్ పై పెట్టాలని కోరారు. దీనికోసం రాజ్యాంగం ప్రకారం స్పీకర్ కు అధికారాలున్నాయని చెప్పారు. రాష్ట్రాలను ఏర్పాటు చేసే విశేషాధికారాలు కేంద్రానికి ఉన్నాయని తెలిపారు. గతంలో రాష్ట్రపతి పాలన విధించి హర్యానా రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని చెప్పారు. తెలంగాణ భవన్ లో కేసీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు మతిస్థిమితం తప్పిన వ్యక్తిలా మాట్లాడుతున్నారని విమర్శించారు. సీమాంధ్ర ప్రాంతంలో నాలుగు ఓట్లు ఎక్కువ వస్తాయనే చంద్రబాబు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని అన్నారు. తెలంగాణ ఏర్పాటును ఇక ఎవరూ ఆపలేరని... కేంద్ర కేబినెట్ నుంచి ఆమోదం పొంది, రాష్ట్రపతి నుంచి బిల్లు వచ్చిందంటే రాష్ట్ర ఏర్పాటు జరిగినట్టేనని తెలిపారు. అందువల్ల విభజనను వ్యతిరేకించకుండా... వారి ప్రాంత అభివృద్ధికి ఏం కావాలో తెచ్చుకునే ప్రయత్నం చేయాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అందరూ విజ్ఞతతో సహకరించాలని కోరుతున్నామని కేసీఆర్ తెలిపారు.

బిల్లు ప్రతులు కేంద్రం నుంచి ఇంగ్లీషులోనే వస్తాయని... వాటిని తెలుగు, ఉర్దూల్లోకి తర్జుమా చేయాల్సిన అవసరం లేదని అన్నారు. అవసరమైతే సభ్యులు ఎవరికి వారే తర్జుమా చేయించుకుంటారని చెప్పారు. ఆర్టికల్ 371-డీకి సవరణలు అవసరం లేదని... విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 371-డీ కావాలంటే ఉంచుకోవచ్చని లేకుంటే లేదని సూచించారు. బిల్లుపై శాసనసభలో చర్చ మాత్రమే ఉంటుందని, ఓటింగ్ ఉండదని తెలిపారు. శాసనసభ్యులకు కేవలం అభిప్రాయాలు చెప్పడానికే మాత్రమే అనుమతి ఉంటుందని చెప్పారు. 14 ఏళ్లుగా తాను దేనికోసం పోరాడుతున్నానో తెలంగాణ ప్రజలకు తెలుసని కేసీఆర్ అన్నారు.

  • Loading...

More Telugu News