: 500, 1000 నోట్లను రద్దు చేయాలి: చంద్రబాబు
అవినీతి అనేది నేడు దేశాన్ని పట్టి పీడిస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. యూపీఏ హయాంలో అనేక కుంభకోణాలు జరిగాయని... దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ వ్యతిరేక గాలి బలంగా వీస్తోందని చెప్పారు. ఐదు వందల రూపాయలు, వెయ్యి రూపాయల నోట్లు అవసరమా? అని ప్రశ్నించారు. ఈ నోట్లను రద్దు చేస్తే, నల్లధనానికి చాలా వరకు ముకుతాడు వేయవచ్చని... మనీ లాండరింగ్ ను కూడా కంట్రోల్ చేయవచ్చని అభిప్రాయపడ్డారు. ఈ రోజు ఆయన తన నివాసంలో మీడియాతో మాట్లాడారు.
అవినీతి వల్ల రూపాయి విలువ పడిపోతోందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. మన దేశానికి చెందిన వారి నల్లధనం దాదాపు 5 లక్షల కోట్లు విదేశాల్లో మూలుగుతోందని అన్నారు. వైఎస్ హయాంలో రాష్ట్రంలో అవినీతి విచ్చలవిడిగా కొనసాగిందని చెప్పారు. అందుకే అవినీతిని అరికట్టడానికి పటిష్ఠమైన లోక్ పాల్ బిల్లును తీసుకురావాల్సిన అవసరముందని తెలిపారు. లోక్ పాల్ బిల్లుపై దేశ వ్యాప్తంగా చర్చ జరగాలని అన్నారు. లోక్ పాల్ బిల్లుకు తెలుగుదేశం పార్టీ మద్దతు ప్రకటిస్తుందని తెలిపారు. అవినీతి రహితమైన సమాజం కోసం అన్నా హజారేకు మద్దతు తెలుపుతున్నామని అన్నారు.