: దిగ్విజయ్ ను చాచి కొట్టండి: జగన్
విభజన విషయంలో కేంద్రం ఆర్టికల్-3ని దుర్వినియోగం చేస్తోందని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఓట్లు, సీట్ల కోసమే ఈ విషయంలో కేంద్రం ముందుకెళుతోందన్న ఆయన... ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోకుండా విభజన తగదని సూచించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వైఎస్సార్సీపీ కోరుతోందని చెప్పారు. సమైక్య రాష్ట్రానికి మద్దతు ఇవ్వాలని వివిధ పార్టీల అధినేతలను కలిసి కోరామన్నారు.
తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జగన్ మాట్లాడారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపైన ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. విభజనకు సహకరిస్తూనే మరోవైపు సమైక్యమంటూ ప్రజలను సీఎం మోసం చేస్తున్నారని జగన్ విమర్శించారు. అన్యాయం చేస్తే చరిత్ర హీనులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. అటు టీడీపీ అధినేత చంద్రబాబు మీదా విమర్శలు చేసిన వైసీపీ అధినేత.. ఇంతవరకు బాబు నోటి నుంచి సమైక్యం అన్న పదం రాలేదని ఎత్తిపొడిచారు. టీడీపీ ఎంపీల్లో నలుగురు సమైక్యం అంటే ఇద్దరు వ్యతిరేకమంటున్నారన్నారు.
అసెంబ్లీలో సమైక్య తీర్మానానికి టీడీపీ, కాంగ్రెస్ మద్దతు పలకాలని జగన్ అన్నారు. ఈ సందర్భంగా దిగ్విజయ్ పై విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ.. తనది కాంగ్రెస్ డీఎన్ఏ అన్న దిగ్విజయ్ ను చాచి చెంపదెబ్బ కొట్టండని విలేకరులతో జగన్ చెప్పారు. ఈ జవాబుకు షాక్ అవ్వడం అక్కడి విలేకరుల వంతైంది. కాగా, సోనియాకు మద్దతు ఇవ్వబోనని ఇప్పటికే పలుమార్లు చెప్పానని, ఇప్పుడూ అదే చెబుతున్నానన్నారు. ఎవరైతే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచుతారో వారినే ప్రధానిని చేస్తామని ఎప్పుడో చెప్పామని పేర్కొన్నారు.