: గోడమీద పిల్లుల్లా సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీల తీరు: పనబాక
విభజన విషయంలో అధిష్ఠానం నిర్ణయాన్ని ధిక్కరిస్తూ కలకలం సృష్టిస్తున్న సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలపై కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి అసహనం వ్యక్తం చేశారు. విభజన బిల్లు పార్లమెంటులో వీగిపోయేలా సొంత పార్టీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వంపై అవిశ్వాసానికి నోటీసులిచ్చిన ఆ ఎంపీల తీరు గోడమీద పిల్లుల్లా ఉందని ఎద్దేవా చేశారు. విభజనకు అందరూ ఆమోదం తెలపడంవల్లే సోనియాగాంధీ నిర్ణయం తీసుకున్నారని ఉద్ఘాటించారు. అయితే, తర్వాత ప్రజల నుంచి వ్యతిరేకత రావటంతో ఇప్పుడు ఎంపీలు చొక్కాలు చింపుకుంటున్నారని వ్యాఖ్యానించారు. ప్రకాశం జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు హాజరైన మంత్రి పైవిధంగా మాట్లాడారు.