: బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై లేఖలను సంధించిన కేజ్రీవాల్
ఢిల్లీ ప్రభుత్వ ఏర్పాటుకు ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు ఇస్తామని బీజేపీ ప్రకటించగా... తాము భేషరతుగా మద్దతు ఇస్తామంటూ కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చింది. అయితే, అరవింద్ కేజ్రీవాల్ మాత్రం తాము ప్రభుత్వ ఏర్పాటుకు ఇతర పార్టీల మద్దతు తీసుకొనేందుకు సిద్ధంగా లేమని ఇంతకు ముందే ప్రకటించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని ఏఏపీని ఢిల్లీ లెఫ్ట్ నెంట్ గవర్నర్ ఆహ్వానించారు. ఈ రోజు కేజ్రీవాల్ ఆయనను కలిసి తమకు పది రోజుల గడువు కావాలని కోరారు. కేజ్రీవాల్ ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ అధ్యక్షులకు లేఖాస్త్రాలను సంధించారు. ప్రధానంగా లేఖలో 18 అంశాలను ఆయన ప్రస్తావించారు. గత పదేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఢిల్లీలో అవినీతి పెరిగిపోయిందని, అభివృద్ది తరిగిపోయిందనీ అంటున్న ఆయన రాసిన లేఖల్లోని ముఖ్యాంశాలు..
దేశ రాజధాని హస్తినలో ప్రస్తుతం ఉన్న వీఐపీ సంస్కృతికి స్వస్తి చెప్పాలని డిమాండ్ చేశారు. వీఐపీలకు కల్పిస్తోన్న ప్రత్యేక భద్రతను తొలగించాలన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు ఎర్ర బుగ్గ కారులను వాడకూడదని, అలాగే వారికి భారీ అధికార భవంతులు కేటాయించరాదని కేజ్రీవాల్ చెప్పారు. సామాజిక కార్యకర్త అన్నాహజారే కోరిన విధంగా జన లోక్ పాల్ బిల్లును యధాతథంగా ఆమోదించాలని అన్నారు. ఢిల్లీకి పూర్తి స్థాయి రాష్ట్ర ప్రతిపత్తి కల్పించాలని కేజ్రీవాల్ కోరారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్న ఢిల్లీ అభివృద్ధి సంస్థ, పోలీస్ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని ఆయన డిమాండ్ చేశారు.
ఢిల్లీలోని ప్రైవేట్ విద్యుత్ సంస్థల్లో జమా ఖర్చులను తనిఖీ చేయాలని కోరారు. ఆ సంస్థల లెక్కల్లో అక్రమాలు బయటపడితే వెంటనే వాటి గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే హస్తిన నగర పరిధిలోని ప్రతి ఇంట్లో విద్యుత్ మీటర్ల తనిఖీ చేపట్టాలని చెప్పారు. దేశ రాజధానిలోని ప్రతి వ్యక్తికి ప్రతిరోజూ కనీసం 220 లీటర్ల మంచినీటిని అందించాలని ఆయన కోరారు. మురికివాడల్లో నివసిస్తున్న వారికి పక్కా గృహాలు నిర్మించి ఇవ్వాలన్నారు. అలాగే ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలను కల్పించాలని ఆయన సూచించారు. సౌకర్యాల కల్పన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు. ప్రజలకు విద్య, వైద్యం, ఆరోగ్యంపై దృష్టి సారించాలన్నారు. ఢిల్లీ నగర పరిధిలోని గ్రామాల్లో ఉండే రైతులకు ప్రత్యేక రాయితీలు ఇవ్వాలని కోరారు. మహిళలపై జరుగుతున్న దాడులపై వెంటనే కేసులు నమోదు చేయాలని.. వాటిపై మూడు నెలల్లో న్యాయ విచారణ పూర్తి చేసి న్యాయవ్యవస్థను పటిష్టపరచాలని కేజ్రీవాల్ పేర్కొన్నారు.