: కృష్ణా జలాల పంపిణీలో రాజకీయ ప్రక్రియ ఉండాలి: సీపీఐ నారాయణ
కృష్ణా జలాల పంపిణీ వ్యవహారంలో బ్రిజేష్ కుమార్ ట్రైబ్యునల్ తీర్పుతో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై రాష్ట్ర సీపీఐ పార్టీ కార్యవర్గం ఈ రోజు ఢిల్లీలో ప్రధానిని కలిసింది. ట్రైబ్యునల్ పై తమకున్న అభ్యంతరాలను, తీర్పుతో జరిగే నష్టాలను ప్రధానికి సీపీఐ బృందం వివరించింది. అనంతరం ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి నారాయణ ప్రధానితో చర్చించిన విషయాలను మీడియా సమావేశంలో వెల్లడించారు. నీటి జలాల పంపిణీలో రాజకీయ ప్రక్రియ ఉండాలని తాము కోరామని చెప్పారు.
ట్రైబ్యునల్ తీర్పులో ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం జరిగిందని, రెండు రాష్ట్రాల ఏర్పాటు తర్వాత మళ్లీ బ్రిజేష్ కుమార్ ను నియమించవద్దని ప్రధానికి విజ్ఞప్తి చేశామన్నారు. తీర్పులో విరుద్ధమైన భావాలు ఉన్నాయని, 75 శాతం నీటి లభ్యత పట్టించుకోకుండా ట్రైబ్యునల్ తీర్పు ఇవ్వడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వనన్ని ఎంపీలను కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రం ఇచ్చిందన్న నారాయణ.. సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ప్రదర్శిస్తున్న అహంకార ధోరణితోనే రాష్ట్రానికి అన్యాయం జరిగిందని విమర్శించారు.