: అధికారం కోసం మామను ఉరి తీయించిన పాలకుడు


తనను అధికారంలో కూర్చోబెట్టి.. తనకు పరిపాలనపై పట్టు వచ్చేలా చేసిన మామ జాంగ్ సాంగ్ థాయెక్(67)నే ఉత్తర కొరియా పాలకుడు కిమ్ జోంగ్ ఉన్ ఉరితీయించాడు. దేశద్రోహిగా నేరం మోపి, శిక్ష వేసి, అమలు చేసేశాడు. ఉత్తర కొరియా దివంగత నాయకుడు, ప్రస్తుత పాలకుడు ఉన్ తండ్రి కిమ్ జోంగ్ ఇల్ సోదరికి ఉరితీయబడ్డ జాంగ్ సాంగ్ భర్త. 2011లో కిమ్ జోంగ్ ఇల్ మరణానంతరం దేశపగ్గాలు చేపట్టిన ఉన్ కు ఆయన అండగా నిలిచారు.

పాలనానుభవం లేని ఉన్ కుదురుకునేలా చేయడంలో జాంగ్ సాంగ్ కీలక పాత్ర పోషించారు. తరువాతి కాలంలో ఇద్దరి మధ్య విబేధాలు పొడచూపాయి. ఉన్ నమ్మకాన్ని జాంగ్ వమ్ముచేశారని, అతను అవినీతి పరుడని, వివిధ మంత్రిత్వ శాఖలు, సంస్థలను తన కబంధ హస్తాల్లో ఉంచుకుని జాతీయ వ్యవహారాలపై పెత్తనం చెలాయించారని ఆరోపించారు.

ఆకలి, పేదరికంతో నిండిన దేశ వైఫల్యాలకు జాంగ్ బాధ్యుడని... అలాగే జాతి విద్రోహ, పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడ్డాడని... పార్టీ, ప్రభుత్వ, సోషలిస్టు వ్యవస్థ నాయకత్వాన్ని నేలకూల్చేందుకు ప్రయత్నించడం వల్లే ఉరి తీయాల్సి వచ్చిందని ఉత్తరకొరియా వివరణ ఇచ్చింది. అయితే ఉత్తరకొరియా ప్రభుత్వ క్రూరత్వానికి జాంగ్ ఉరి మరో సాక్ష్యం అని అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి మేరీ హర్ఫ్ పేర్కొన్నారు. ఉన్ అధికారాన్ని పదిలం చేసుకునేందుకు ప్రజల్ని భయపెట్టే చర్యలకు పాల్పడుతున్నారని దక్షిణకొరియా అధ్యక్షుడు పార్క్ గ్యున్ హై ఆరోపించారు. ఉత్తర కొరియా ప్రభుత్వం చేసిన చర్య విపరీత పరిణామాలకు దారి తీస్తుందని జపాన్ రక్షణ మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News