: దక్షిణ ధృవంలో అడుగు పెట్టిన ప్రిన్స్ హ్యారీ
ప్రిన్స్ చార్లెస్, డయానాల రెండో కుమారుడు, బ్రిటీష్ యువరాజు ప్రిన్స్ హ్యారీ దక్షిణ ధృవంలో అడుగుపెట్టాడు. 'వాకింగ్ విత్ ది వూండెడ్ సౌత్ పోల్ ఛాలెంజ్' అనే ఛారిటీ ట్రిప్ లో భాగంగా హ్యారీ మంచు ఖండంలో అడుగుమోపాడు. యుద్ధంలో గాయపడిన సైనికుల సహాయార్థం నిధుల సమీకరణకు ఈ యాత్రను చేపట్టాడు. ఈ యాత్రలో ఐదు మంది సభ్యులతో కూడిన మూడు టీంలు పాల్గొన్నాయి. ఈ మూడు జట్లలో 'గ్లెన్ ఫిడిచ్' అనే జట్టుకు ప్రిన్స్ హ్యారీ నాయకత్వం వహించారు. ఇంకో విషయం ఏంటంటే జట్టు సభ్యులందరూ యుద్ధంలో గాయపడిన సైనికులే. ప్రారంభంలో ఈ ఈవెంట్ ను ఒక రేస్ లాగా నిర్వహించాలనుకున్నప్పటికీ... దక్షిణ ధృవంలో నెలకొన్న అత్యంత దారుణ పరిస్థితుల నేపథ్యంలో, దాన్ని ఒక యాత్రలా మార్చారు. ఈ యాత్రలో హ్యారీతో పాటు ప్రఖ్యాత నటులు డొమినిక్ వెస్ట్, అలెగ్జాండర్ స్కార్స్ గార్డ్ లు పాలుపంచుకున్నారు. ప్రస్తుతం అక్కడ మైనస్ 31 డిగ్రీల చలి ఉందని హ్యారీ తెలిపాడు.