: పదిరోజుల సమయం కోరిన కేజ్రీవాల్
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తమకు పది రోజుల సమయం కావాలని ఏఏపీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కు తెలియజేశారు. లెఫ్టినెంట్ గవర్నర్ ను కలిసిన అనంతరం కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడారు. ఏఏపీకి ఎలాంటి షరతులు లేకుండా మద్దతు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ లెఫ్టినెంట్ గవర్నర్ కు లేఖ ఇచ్చిందని తెలిపారు. కాంగ్రెస్ తీరు తమను విస్మయానికి గురిచేసిందని కేజ్రీవాల్ అన్నారు. బీజేపీ కూడా మాకు మద్దతిస్తామని అంటోందని తెలిపారు. మాకు కాంగ్రెస్, బీజేపీలు ఎందుకు మద్దతివ్వాలనుకుంటున్నాయో అర్థం కాకుండా ఉందంటూ ఎద్దేవా చేశారు. ఈ విషయంలో ఆ రెండు పార్టీలూ పూర్తిగా వివరణ ఇవ్వాలని కోరారు. తమకు సాధారణ మద్దతు అవసరం లేదని... సైద్ధాంతిక మద్దతు కావాలని స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి కావడానికో, అధికారం కోసమో తాము రాజకీయాల్లోకి రాలేదని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. అంశాల వారీగా మద్దతిస్తే... సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తాము సిద్ధమని తెలిపారు. జన లోక్ పాల్ బిల్లు, ఢిల్లీకి రాష్ట్ర హోదాతో పాటు పలు అంశాలపై మద్దతు ఇవ్వగలరా? అని ప్రశ్నిస్తున్నామని అన్నారు. ఢిల్లీలో నీరు, కరెంట్ లాంటి అంశాలపై మా సిద్ధాంతాలకు అనుగుణంగా మీరు పనిచేయగలరా? అని ప్రశ్నించారు. 15 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీ హయాంలో జరిగిన అవినీతి, కుంభకోణాలపై తాము విచారణ చేపడతామని... దానికి కాంగ్రెస్ సిద్ధమేనా? అని ప్రశ్నించారు. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ, తాను సోనియాగాంధీకి, రాజ్ నాథ్ సింగ్ కు లేఖ రాశానని చెప్పారు. ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేమంటూ బీజేపీ స్పష్టం చేసిన తర్వాత... లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ప్రభుత్వ ఏర్పాటు కోసం ఏఏపీకి ఆహ్వానం పంపిన విషయం తెలిసిందే.