: ఆ ఉపగ్రహంపై నీరుందేమో!


అంతరిక్షంలోని సౌరకుటుంబంలో ఒక్క మన భూమిపై మినహా ఇతర గ్రహాలపై నీరు ఉండే అవకాశాలు ఉన్నాయా? అనే విషయంపైన ఎప్పటినుండో శాస్త్రవేత్తలు పరిశోధనలు సాగిస్తున్నారు. ఈ పరిశోధనల నేపథ్యంలో గురుడి ఉపగ్రహం యూరోపాపై నీటి ఆవిరికి సంబంధించిన ఆనవాళ్లను శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రత్యేక టెలిస్కోప్‌ ద్వారా శాస్త్రవేత్తలు అక్కడ నీటి ఆవిరికి సంబంధించిన ఆనవాళ్లను పసిగట్టారు.

గతంలో నిర్వహించిన పరిశోధనల్లో యూరోపా ఉపగ్రహం ఉపరితలంపై ఏకంగా ఒక సముద్రమే ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. తాజాగా హబుల్‌ టెలిస్కోప్‌ ద్వారా యూరోపా దక్షిణ ధృవంమీద నీటిఆవిరి ఆనవాళ్లను గుర్తించామని నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు. యూరోపా ఉపరితలంపై నుండి పైకి వచ్చే నీటిబుగ్గల కారణంగానే నీటి ఆవిరి ఏర్పడుతుండవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

ఒకవేళ ఇదే నిజమైతే యూరోపా మీద నివాసయోగ్యమైన వాతావరణం ఉండటానికి చాలావరకూ అవకాశం ఉన్నట్టేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో యూరోపా రసాయనిక స్వభావాన్ని తెలుసుకోవడానికి పరిశోధనలు సాగించడంపై దృష్టి సారిస్తామని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన లారెంజ్‌రోత్‌ చెబుతున్నారు. యూరోపాపైన ఉండే పగుళ్లు వల్ల కూడా నీటిఆవిరి వెలువడుతుండవచ్చని రోత్‌ చెబుతున్నారు.

  • Loading...

More Telugu News