: భారత్ లో 4 లక్షల కోట్ల నల్లధనం: నిఘా సంస్థ నివేదిక
భారత్ నుంచి నల్లధనం బయట దేశాలకు భారీగా తరలిపోతోందని అంతర్జాతీయ నిఘా సంస్థ జీఎఫ్ఐ నివేదికలో పేర్కొంది. 2011వ సంవత్సరంలో భారత్ నుంచి విదేశీ బ్యాంకులకు తరలిపోయిన నల్లధనం ఏకంగా నాలుగు లక్షల కోట్ల రూపాయలకు చేరిందని నల్లధన వివరాల గుట్టు విప్పింది. ఇది అంత క్రితం ఏడాదితో పోలిస్తే 24 శాతం ఎక్కువని తేలింది.
ఈ లెక్కన 2011 లోని భారత వార్షిక బడ్జెట్ రూ. 13 లక్షల కోట్లలో, సుమారు మూడో వంతు (4 లక్షల కోట్లు) నల్లధనం విదేశీ బ్యాంకులకు చేరిపోయింది. ఇది భారత ప్రభుత్వం గ్రామీణాభివృద్ధికి కేటాయించిన నిధులకు ఐదు రెట్లు ఎక్కువ. విద్యాభివృద్ధి నిధులకు ఏడు రెట్లు ఎక్కువ, అలాగే దేశ ప్రజల ఆరోగ్యానికి ఖర్చు చేసే నిధులతో పోలిస్తే 14 రెట్లు ఎక్కువ ఉంది. దీంతో దేశంలోని నల్లధనాన్ని అరికడితే భారతదేశాన్ని మరింతగా అభివృద్ధి చేసుకోవచ్చని నివేదిక సూచించింది.