: కొత్త కణజాలాన్ని మన దేహమే తయారుచేసుకుంటుంది
మన శరీరంలో దెబ్బతిన్న కణజాలాన్ని తిరిగి మన దేహమే తయారుచేసుకుంటుంది. ఇలా తయారుచేసుకునే సహజ జీవ పదార్ధాలు మన శరీరంలోనే ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీన్ని వైద్య అవసరాలకోసం జీవచట్రంగా మలచుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.
క్లెమ్సన్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు పూర్తిస్థాయిలో పనిచేసే గుండె కండరాన్ని తిరిగి సృష్టించగల సహజ జీవపదార్థాలను కనుగొన్నారు. ఎక్స్‌ట్రా సెల్యులార్ మ్యాట్రిక్స్ (ఈసీఎం) అనే ఈ సహజ జీవ పదార్ధం కణాలను నియంత్రించటానికి ఉపయోగపడుతుంది. దీన్ని వైద్య అవసరాలకోసం జీవ చట్రంగా మలచుకోవచ్చని, దీనిద్వారా దెబ్బతిన్న కణజాలాన్ని మరమ్మత్తు చేయవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
బైపాస్ సర్జరీ తర్వాత పెరికార్డియానికి సమీపంలో ఐదేళ్లక్రితం అమర్చిన జీవచట్రం మీద పరిశోధకులు అధ్యయనం చేశారు. ఇది పూర్తిస్థాయిలో పనిచేయగల కణజాలంగా రూపొందడాన్ని పరిశోధకులు గుర్తించారు. అంటే శరీరం తన కణజాలాన్ని తిరిగి తానే వృద్ధి చేసుకోగలదని ఈ పరిశోధన ద్వారా వెల్లడైనట్టు చెబుతున్నారు.