: కనుపాపలను కంట్రోల్‌ చేస్తుంది


మీ కంటి కనుపాపలను కంట్రోల్‌ చేస్తూ, మీరు సకాలంలో కళ్లను ఆర్పేలా చేసే ఒక సరికొత్త కళ్లజోడు మార్కెట్లోకి రానుంది. ఇప్పుడు ఎక్కువమంది కంప్యూటర్లముందు కూర్చుని ఉండడం వల్ల ఒక్కోసారి కంప్యూటర్‌ స్క్రీన్‌ మీదనుండి చూపు మరల్చకుండా అలాగే కళ్లార్పకుండా కంప్యూటర్‌ను చూస్తుంటారు. ఇలా ఎక్కువసేపు ఉండడం వల్ల అలాంటి వారికి త్వరలోనే డ్రై ఐస్‌ సమస్య వస్తుంది. ఇలాంటి సమస్యలకు పరిష్కారంగా ఒక సరికొత్త కళ్లజోడును పరిశోధకులు రూపొందించారు. ఈ కళ్లజోడు మనం సకాలంలో కళ్లను ఆర్పేలా చేస్తుందట. దీనివల్ల డ్రై ఐస్‌ సమస్యను తగ్గించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.

జపాన్‌కు చెందిన మాశుంగా అనే కంపెనీ ఒక సరికొత్త కళ్లజోడును తయారుచేసింది. ఈ కళ్లజోడును ధరించడం వల్ల ఇవి కనురెప్పలు ప్రతి పది సెకన్లకు ఒకసారి మూసేలా చేస్తాయట. కంప్యూటరు స్క్రీన్‌ను తదేకంగా చూడడం వల్ల చాలాసేపటి వరకూ మనం రెప్పలను వాల్చడం మరిచిపోతుంటాం. దీనివల్ల కళ్లు పొడిబారి డ్రై ఐస్‌ సమస్య తలెత్తుతుంది. ఈ సమస్యకు తాము రూపొందించిన కళ్లజోడు సరైన పరిష్కారమని మాశుంగా కంపెనీ వారు చెబుతున్నారు. వీటిని ధరించడం వల్ల మన కళ్లు ప్రతి పది సెకన్లకు ఒకసారి 0.2 సెకన్ల పాటు మూసుకుంటాయట. ఈ కళ్లజోడు ఎడమవైపున ఒక చిన్న బ్యాటరీ, కుడివైపున ఒక స్విచ్‌ ఉంటుంది. ఈ స్విచ్‌ను ఒకసారి నొక్కితే ప్రతి పదిసెకన్లకు ఒకసారి కళ్లద్దాలపైన ఉండే ద్రవస్ఫటిక పొరలు మసకబారుతాయి. దీంతో కనురెప్పలు అనుకోకుండానే ఒకసారి మూసుకుని మళ్లీ తెరచుకుంటాయి. 33 గ్రాముల బరువుండే ఈ కళ్లజోడు ఖరీదు 153 డాలర్లు. అంటే దాదాపుగా రూ.9,500 అన్నమాట. మొత్తానికి మన కళ్లుకప్పే కళ్లజోడు బాగానే వుంది కదూ?

  • Loading...

More Telugu News