: ప్రశాంతత కోరుకోవడం మానవనైజం!
ప్రశాంతంగా ఉండాలని మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. పుట్టినప్పటినుండీ రణగొణ ధ్వనులమధ్య ఉండేవారైనా రోజులో కనీసం ఒక్కసారైనా కొద్దిసేపు ఆనందంగా, ప్రశాంతమైన వాతావరణంలో గడపాలని కోరుకుంటారు. అందుకే ప్రశాంతంగా ఎలాంటి రగడ లేని పల్లెటూళ్లంటే అందరికీ ఇష్టం. నిశ్శబ్దంగా ఉండే పరిసరాలను ఆస్వాదించడానికి అందరూ ఉవ్విళ్లూరుతారు. ఇలా ప్రశాంత వాతావరణాన్ని ఇష్టపడే విషయంపై పరిశోధన సాగించిన శాస్త్రవేత్తలకు ప్రశాంతతను ఇష్టపడడం అనేది మానవ నైజమని తేలింది.
ఈ గుణం పుట్టుకనుండే వచ్చిందని, కాబట్టే ఎలాంటి ప్రాంతాల్లో పుట్టినవాళ్లైనా కూడా ప్రశాంత వాతావరణంలోకి వెళ్లి కాసేపు గడపాలని ఆశపడతారని పరిశోధకులు చెబుతున్నారు. ఇలా ఆశపడడానికి కారణం ప్రశాంతతను ఆశించడం అనేది మనిషికి జన్మత: సంక్రమించిన లక్షణమని పరిశోధకులు చెబుతున్నారు. ఈ లక్షణంపై ఎలాంటి ప్రభావాలు లేకుండా ఇది అందరిలో ఒకేలా ఉండడం విశేషం.