: మలేరియాను మట్టుబెట్టవచ్చు
మలేరియాని నిర్మూలించడానికి ఎప్పటికప్పుడు కొత్త మందులతో ప్రయత్నిస్తున్నా మలేరియా కారక ప్లాస్మోడియం పరాన్నజీవి మందుల ప్రభావాన్ని తట్టుకునేలా మొండిగా తయారవుతోంది. దీంతో దీని డీఎన్‌ఏపై పరిశోధన సాగించిన శాస్త్రవేత్తలు మలేరియా కారక ప్లాస్మోడియం పరాన్నజీవి డీఎన్‌ఏ బలహీనపడుతున్న అంశాన్ని గుర్తించారు.
కాలిఫోర్నియా విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు నిర్వహించిన పరిశోధనలో ప్లాస్మోడియం జన్యుపటంలో డీఎన్‌ఏ మిథైలేషన్ తక్కువ స్థాయిలో ఉంటున్నట్టు గుర్తించారు. ఇప్పటి వరకూ మలేరియా పరాన్నజీవిని నిర్మూలించడానికి వాడుతున్న మందులను తట్టుకునేలా మొండిగా తయారవుతున్న ప్లాస్మోడియంను చంపడానికి కొత్త మందులను తయారుచేయడంలో ప్రస్తుతం తాము కనుగొన్న అంశం చక్కగా తోడ్పడుతుందని భావిస్తున్నట్టు పరిశోధకులు చెబుతున్నారు.
డీఎన్‌ఏ మిథైలేషన్ బలహీనపడడం అనేది ప్లాస్మోడియం మనుగడకు కీలకం కావచ్చని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన కరైన్ లీ రోచ్ తెలిపారు. ప్లాస్మోడియం పరాన్నజీవి అభివృద్ధిలోనూ, వ్యాధి విషయంలోనూ డీఎన్‌ఏ సంబంధ రసాయన మార్పులు కీలకమైన పాత్రను పోషిస్తాయి. ప్లాస్మోడియంలోని డీఎన్‌ఏ మిథైలేషన్ ఎంజైము మనుషుల్లోకన్నా భిన్నంగా ఉందని రోచ్ చెబుతున్నారు. కాబట్టే ఈ ఎంజైమును అడ్డుకునే మందును రూపొందిస్తే మలేరియా పరాన్నజీవిని చంపవచ్చని రోచ్ వివరించారు.