: ఇది బీపీని కంట్రోల్ చేస్తుంది
రక్తపోటుగా చెప్పే బీపీని అదుపులో ఉంచడానికి రోజూ మందులు వేసుకుంటూ ఉండాల్సిందే. అయినా కూడా ఒక్కోసారి రక్తపోటు అదుపు తప్పుతుంటుంది. ఇలాంటి వారికి మనం తీసుకునే ఆహారంలోనే చిన్నపాటి మార్పులు చేసుకుంటే చాలని నిపుణులు చెబుతున్నారు. మనం తీసుకునే ఆహారంలో ముల్లంగిని ఒక భాగంగా చేసుకుంటే చాలట. ఇందులో ఉండే పొటాషియం మన శరీరంలోని రక్తపోటును అదుపులో ఉంచుతుంది. నిజానికి ముల్లంగిని చాలామంది ఇష్టపడరు. అయితే దీనివల్ల బోలెడంత ప్రయోజనం ఉంది. కాబట్టి దీన్ని ఆహారంలో తప్పకుండా ఒక భాగం చేసుకోవాల్సి ఉంది.
బీపీ ఉన్నవారు ఎక్కువగా ముల్లంగిని ఆహారంలో తీసుకోవాల్సి ఉంటుంది. దీన్ని కూరల్లో వేసుకోవడం, లేదా తురుము చేసుకోవడం ఇలా ఏదో ఒక రూపంలో దీన్ని తీసుకుంటే మంచిది. కొందరికి ఒక్కోసారి షుగర్ లెవెల్స్ పెరగడం, లేదా తగ్గడం జరుగుతుంటుంది. ఇలాంటి సమస్యను అడ్డుకునే శక్తి ముల్లంగికి ఉంది. అంతేకాదు ముల్లంగి మన శరీరంలోని తెల్లరక్త కణాలను అధికంచేసి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. ఇది మన రక్తానికి తగినంత ఆక్సిజన్‌ను అందిచడం వల్ల కాలేయానికి పనిభారం తగ్గుతుంది. దీంతో కామెర్ల సమస్య మన దరిదాపులకు కూడా రాదు.
గొంతు, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడేవారు ముల్లంగిని తింటే చక్కటి ఉపశమనం కలుగుతుంది. ముల్లంగిని తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు వంటివి రావు. ఇందులో ఘాటు వల్ల తక్షణం గొంతునొప్పి, దగ్గు, జలుబు వంటి వాటికి ఉపశమనం కలుగుతుంది. ముల్లంగిలో విటమిన్ ఎ, డి, ఇంకా బి-12 కూడా లభిస్తాయి. పీచు పదార్ధంగా కూడా ఇది ఉపకరిస్తుంది. కాబట్టి ఇన్ని సుగుణాలున్న ముల్లంగిని చక్కగా మీ ఆహారంలో భాగంగా చేసుకుని ఆరోగ్యంగా ఉండండి మరి.