: ఎవరెన్ని చెప్పినా.. మాగేమ్ ప్లాన్ మాదే: గాదె
తమ విన్నపాలను, విజ్ఞప్తులను పట్టించుకోకుండా, రాజ్యాంగ పద్ధతులను పాటించకుండా అప్రజాస్వామికంగా జరుగుతున్న రాష్ట్ర విభజనను తాము సమర్థించలేమని కాంగ్రెస్ సీనియర్ నేత గాదె వెంకటరెడ్డి స్పష్టం చేశారు. సీఎల్పీ కార్యాలయంలో జరిగిన సీమాంధ్ర నేతల భేటీ ముగిసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 2009 డిసెంబర్ 9 ప్రకటన తరువాత సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు పలుమార్లు ఢిల్లీ వెళ్లి ప్రధాని, అహ్మద్ పటేల్, ఆజాద్, దిగ్విజయ్ సింగ్ లతో పాటు జీవోఎంను కలసి రాష్ట్ర విభజన తమకు సమ్మతం కాదని చెప్పామని తెలిపారు.
సీమాంధ్రకు చెందిన రాజకీయ నేతలంతా సమైక్య నినాదాన్ని బలపరిచామని ఆయన గుర్తు చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో ఎన్ని ఉల్లంఘనలు ఉన్నాయో అన్నీ చేసి రాష్ట్ర విభజన నిర్ణయం తీసుకుందని విమర్శించారు. రెండో ఎస్సార్సీ, శ్రీకృష్ణ కమీటీ, రాజ్యాంగం, ప్రజాస్వామ్య విలువలు అన్నీ ఉల్లంఘించి మరీ రాష్ట్ర విభజన చేస్తామంటున్నారని.. విభజన సమస్యలకు పరిష్కారం కాదని గాదె సూచించారు. అందుకే తాము రాష్ట్ర విభజన సరికాదని స్పీకర్ కు నోటీసిచ్చామని గాదె అన్నారు. శాసనసభా చట్టం ప్రకారం 77,78 రూల్స్ ప్రకారం స్పీకర్ కు తీర్మానం ఇచ్చామని గాదె వెల్లడించారు. విభజనను అప్రజాస్వామికంగా పేర్కొంటూ... రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని తాము నోటీసులో కోరామని ఆయన తెలిపారు.
దిగ్విజయ్ సింగ్ గతంలో పలు మార్లు వ్యాఖ్యానాలు చేస్తూ, రెండు సార్లు ముసాయిదా రాష్ట్ర అసెంబ్లీకి వస్తుందని చెప్పారని గుర్తు చేశారు. తీర్మానం రూపంలో ఒకసారి, బిల్లు రూపంలో ఇంకోసారి అసెంబ్లీకి బిల్లు వస్తుందని అన్నారని తెలిపారు. గతంలో రాష్ట్రాల ఏర్పాటు సందర్భంగా ఇప్పుడు నెలకొన్న పరిస్థితుల్లేవని అన్నారు.
తెలంగాణ ఏర్పాటు జరగాలంటే రాజ్యాంగ సవరణ జరిగితీరాలని అన్నారు. రాజ్యాంగంలోని 7 వ షెడ్యూల్ ను మార్చాలని... ఆర్టికల్ 368 కింద సవరణ జరగాలని గాదె సూచించారు. తెలంగాణ ఏర్పడాలంటే రాష్ట్ర శాసన సభలో సగానికి పైగా సభ్యులు హాజరై.. వారిలో 2/3వ వంతు విభజనను ఆమోదిస్తే.. అప్పుడు జరిగిన తీర్మానాన్ని దేశంలోని 28 రాష్ట్రాల్లో సగం రాష్ట్రాలు అనుకూలంగా తీర్మానం చేస్తే.. అప్పుడు విభజన జరుగుతుందని వివరించారు. పరిపాలనా పరంగా సుదీర్ఘంగా చర్చ జరిపి ఓటింగ్ జరపాలని తాము కోరుతున్నామని గాదె స్పష్టం చేశారు.