: తాగకుంటే తొందరగా పోతామట
తాగితే బతకగలను... కానీ తాగలేను... అంటూ ఒక సినిమాలో హీరో డైలాగ్ చెబుతాడు. అలాగే రోజూ కాస్తోకూస్తో తాగేవారు చక్కగా బతుకుతారట. తాగనివారి కంటే కూడా రోజూ కొద్దిగా పుచ్చుకునేవారే చక్కగా జీవిస్తారని పరిశోధకుల అధ్యయనంలో తేలింది. తాజాగా నిర్వహించిన అధ్యయనంలో లైట్‌గా మందు తీసుకునేవారి ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా ఉండడంలేదని తేలింది. ఫుల్లుగా లాగించేవారికి మాత్రం ఆరోగ్యం పాడైపోయే ప్రమాదముందని మనకు తెలిసిందే.
టెక్సాస్ యూనివర్సిటీలోని చార్లెస్ హోలహాన్ బృందం నిర్వహించిన పరిశోధనలో రోజుకు ఒకటి నుండి మూడు పెగ్గులను తీసుకునే వారిలో మరణాల శాతం తక్కువగా ఉందని, ఇలాంటి వారితో పోల్చుకుంటే అసలు మద్యం తాగని వారిలోనే మరణాల శాతం ఎక్కువగా ఉందని తేలింది. ఇందుకుగానూ శాస్త్రవేత్తలు సుమారు 1824 మంది వృద్ధుల మరణాలను గురించి అధ్యయనం చేశారు. ఈ అధ్యయనంలో పై విషయం వెల్లడైందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే తాగితే బతికేస్తాం కదా అని రోజూ పూటుగా లాగించేసేవారికి ఈ సిద్ధాంతం వర్తించదట. జీవితంలో మత్తు పానీయాల జోలికి కూడా వెళ్లని వాళ్లతో పోల్చుకుంటే రోజూ రెండు మూడు పెగ్గులను లాగించేసేవారే ఎక్కువకాలం బతుకుతున్నారని పరిశోధకులు చెబుతున్నారు.